
మద్యం మత్తులో కారును ఢీకొట్టిన యువకుడు
కొమ్మాది: బీచ్‌రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మద్యం సేవించి బైక్ నడుపుతున్న యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గీతం కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న పుక్కళ్ల ప్రవీణ్ తన స్నేహితులు అభిషేక్, లోకేష్‌లతో కలిసి బైక్‌పై మద్యం తాగి అతివేగంగా వచ్చాడు. సాయిప్రియ రిసార్ట్ వద్ద యూ–టర్న్ తీసుకుంటున్న కారును బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు ఒకవైపు పూర్తిగా దెబ్బతినగా, ప్రవీణ్ బైక్‌పై నుంచి ఎగిరి దూరంగా పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని వెంటనే గీతం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే ప్రవీణ్ స్నేహితులు అభిషేక్, లోకేష్ అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.