
పీఎంఏవై–అర్బన్ 2.0 పథకంపై లబ్ధిదారులకు అవగాహన
డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన–అర్బన్ 2.0 పథకంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు. పథకం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో పీఎంఏవై–అర్బన్ 2.0 ప్రచార అవగాహన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం అంగీకార్–2025 పేరుతో అక్టోబర్ 31 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ పథకం కింద సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.00 లక్ష కలిపి మొత్తం రూ.2.50 లక్షలు ఉచితంగా అందిస్తుందని కమిషనర్ వివరించారు. ఈ పథకంతో పాటు, ఇల్లు నిర్మించుకున్న వారికి పీఎం సూర్య ఘర్ ముఫ్తీ మలి యోగ ఉచిత విద్యుత్ పథకం వంటి ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కూడా అందుతాయని ఆయన తెలిపారు. ప్రజలకు ఈ పథకాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని కమిషనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.ఎస్. వర్మ, యూసీడీ ప్రాజెక్టు డైరెక్టర్ పి. సత్యవేణితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.