
అమెరికా బిల్లు.. ఐటీ కంపెనీలకు చిల్లు
హైర్ బిల్లుపై ఐటీ సంస్థల బేజారు
విదేశీ సేవలపై 25 శాతం పన్ను విధించేందుకు సిద్ధమవుతున్న అగ్రరాజ్యం
విశాఖలో 75 శాతం
ఐటీ కంపెనీలపై ప్రభావం
లాభాలకు భారీగా గండిపడే అవకాశం
బిల్లు పాసైతే మరింత
ప్రమాదమంటున్న నిపుణులు
సాక్షి, విశాఖపట్నం: అమెరికా ప్రతిపాదించిన ‘హాల్టింగ్ ఇంటర్నేషనల్ రీ లొకేషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ యాక్ట్’ చట్టం భారత ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ చట్టం విదేశీ సేవలపై 25శాతం పన్ను విధించాలని ప్రతిపాదిస్తోంది. ఈ పన్ను విధానం అమలులోకి వస్తే, భారతదేశం, ముఖ్యంగా విశాఖపట్నంలోని ఐటీ, బీపీఓ కంపెనీలకు భారీ నష్టం వాటిల్లవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.
‘హైర్’ చట్టం అంటే ఏమిటి?
అమెరికన్ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వడం, విదేశీ కార్మికులను నియమించుకోవడాన్ని తగ్గించడం లేదా నిషేధించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. అమెరికన్ కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకుంటే 25 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని అమెరికా పౌరులకు ఉద్యోగాలు సృష్టించేందుకు, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తారు. ఈ చట్టం డిసెంబర్ 31 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
భారత్‌పై ప్రభావం
భారతదేశంలో ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీల ఆదాయంలో ఎక్కువ భాగం అమెరికా నుంచే వస్తుంది. ఈ కొత్త పన్ను విధానం వల్ల వాటి లాభాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. విశాఖలో బీపీఓ సంస్థలన్నీ దాదాపుగా యూఎస్ ఆధారిత కంపెనీలే. ఇక్కడున్న 200 ఐటీ సంస్థల్లో 75శాతం యూఎస్ క్లయింట్‌లను కలిగి ఉన్నాయి. ఈ అదనపు పన్ను భారం వల్ల ఇక్కడి కంపెనీలు ఆర్థికంగా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. లాభాలు తగ్గితే, కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించే అవకాశం ఉంది. దీనివల్ల వందలాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం పాసయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే, అమెరికా కంపెనీలకు నైపుణ్యం కలిగిన ఉద్యోగులు దొరకకపోతే, వారి వ్యాపారాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని, ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉందని వారు విశ్లేషిస్తున్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే, భారత్‌తో పాటు అమెరికా కంపెనీల మార్జిన్లు కూడా క్షీణించే అవకాశం ఉందని హెచ్చరించారు.