
స్మార్ట్ పరేషన్
స్మార్ట్ రేషన్ కార్డుల కోసం లబ్ధిదారుల ప్రదక్షిణలు
ఇప్పటికీ లబ్ధిదారులకు అందని కార్డులు 91,336
తమ వద్ద లేవని తప్పించుకుంటున్న
రేషన్ డీలర్లు, సచివాలయ ఉద్యోగులు
ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
మహారాణిపేట : రేషన్ లబ్ధిదారులు గత కొన్ని రోజుల నుంచి కూటమి ప్రభుత్వం ఇస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోవడానికి రేషన్ డిపోలకు వెళ్తున్నారు. తమ వద్దకు ఇంకా రాలేదు సచివాలయానికి వెళ్లాలని రేషన్ డీలర్లు సూచిస్తున్నారు. అక్కడికి వెళ్తే కొద్ది సేపు వెతికి కార్డు ఇక్కడ లేదు రేషన్ డిపోకు వెళ్లాలని సిబ్బంది చెబుతున్నారు. ఇలా రేషన్ డిపో, సచివాలయాల చుట్టూ లబ్ధిదారులు చక్కర్లు కొడుతున్నారు. కాని ఎక్కడా స్మార్ట్ కార్డు జాడ దొరకడం లేదు. సెప్టెంబర్ సరుకులు తీసుకోవడానికి ఈనెల 15వ తేదీ గడువుగా నిర్ణయించారు. ఆ తర్వాత రేషన్ షాపులన్నీ మూత పడ్డాయి. మళ్లీ 26వ తేదీ నుంచి రేషన్ డిపోలు తెరిచి ఉంటాయి. అప్పటి వరకు ఎవరి రేషన్ కార్డులు తీసుకోవడానికీ వీలు లేకుండా పోయింది. 26వ తేదీ నుంచి వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ ఇవ్వనున్నారు. అయితే స్మార్ట్ కార్డు ఉంటే గాని రేషన్ సరుకులు ఇవ్వమని రేషన్ డీలర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల రేషన్ డీలర్లతో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డీఎస్‌వో భాస్కరరావు సమావేశం ఏర్పాటు చేసి కార్డుల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. అయినా డీలర్ల స్పందన అంతంత మాత్రంగానే ఉంది.
పంపిణీకి నోచుకోని 91,336 కార్డులు
కూటమి సర్కార్ గత నెల 26న స్మార్డ్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. 26 నుంచి 31వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి కార్డులు పంపిణీ చేశారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అన్ని రేషన్ డిపోల్లో వేలిముద్రలు వేసి కార్డులు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కోసం డీఎస్‌వో ఆధ్వర్యంలో అసిస్టెంట్ సివిల్ సప్లయి అధికారుల పర్యవేక్షణలో చెకింగ్ ఇన్‌స్పెక్టర్లు, సచివాలయం, చౌకధరల దుకాణాల వారీగా ఏర్పాటు చేసినట్టు పౌరసరఫరాల శాఖ తెలిపింది. 5,17,155 స్మార్ట్ రేషన్ కార్డులు జిల్లాకు చేరుకున్నాయి. ఈ కార్డుల పంపిణీ కోసం పలు ఏర్పాట్లు చేసినట్టు డీఎస్‌వో వి.భాస్కరరావు తెలిపారు. సచివాలయాల సిబ్బంది ద్వారా 1,92,008, డీలర్ల ద్వారా 2,33,811 కార్డుల పంపిణీ చేశారు. మొత్తంగా ఇప్పటివరకు 4,25,819 పంపిణీ చేయగా ఇంకా 91,336 కార్డులు పంపిణీ చేయాల్సి ఉందని డీఎస్‌వో పేర్కొన్నారు. స్మార్ట్ కార్డుల కోసం రేషన్ డిపోలకు వెళ్తే సచివాలయానికని.. అక్కడకు వెళ్తే రేషన్ డిపోలకు వెళ్లాలని తిప్పుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు.
కీలకంగా స్మార్ట్ కార్డు
నిత్యావసర వస్తువులతో పాటు పలు ప్రభుత్వ పథకాలకు ఈ స్మార్డు కార్డు అవసరం ఉంది. వివరాలు సక్రమంగా లేకపోతే కొన్ని సమయాల్లో అధికారులు తిరస్కరించే అవకాశం ఉంటుంది. కొత్తగా స్మార్ట్ కార్డులు మంజూరు చేసే సమయంలో లబ్ధిదారుని వివరాలు, అడ్రస్ సక్రమంగా ముంద్రించాల్సిన బాధ్యత సర్కార్ మీద ఉంది. అలా జరగనందున కొన్ని సమయాల్లో ప్రభుత్వ పథకాలకు దూరమవుతామనే ఆందోళన ప్రజల్లో ఉంది. కార్డుల్లో పిల్లల పేర్లు, వయసు తేడా, చిరునామా తదితర అంశాలు సక్రమంగా ఉండాలని కార్డుదారులు కోరుతున్నారు. అయితే పూర్తిగా పంపిణీ జరగకపోవడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.