
ఎయిర్‌పోర్టులో ఘనంగా యాత్రి సేవా దివాస్
గోపాలపట్నం: విశాఖ విమానాశ్రయంలో గురువారం నిర్వహించిన యాత్రి సేవా దివాస్ ఆద్యంతం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు కార్యక్రమాలు నిర్వహించారు. టెర్మినల్ భవనంలో నృత్యభారతి డ్యాన్స్ అకాడమీ కళాకారులు ప్రదర్శించిన సాంప్రదాయ, ఫోక్ డ్యాన్సులు ఆకట్టుకున్నాయి. ఎయిర్ పోర్టు ప్రాంగణంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు పీవీఎన్ మాధవ్, గండి బాబ్జి, కె.ప్రభాకర్, కూన రవికుమార్ తదితరులు మొక్కలు నాటారు. గోపాలపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిపిన చిత్రలేఖనం, క్విజ్ పోటీల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని, తమ ప్రతిభను ప్రదర్శించారు.
వైద్య శిబిరాలకు విశేష స్పందన
ఎయిర్‌పోర్టు ఆవరణలో వాసన్ ఐ కేర్ సహకారంతో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు కంటి పరీక్షలు చేయించారు. వైజాగ్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఎయిర్‌పోర్టు అథారిటీ ఉద్యోగులు, ప్రయాణికులు, సిబ్బంది పాల్గొన్నారు. విమానాశ్రయ పరిశుభ్రత, సేవా ప్రమాణాలపై ప్రయాణికులతో మాట్లాడి, అభిప్రాయాలు తీసుకున్నారు.
ఉద్యోగావకాశాలపై అవగాహన
విమానాశ్రయాల్లో వివిధ రకాల ఉద్యోగావకాశాలు, అభ్యసించాల్సిన కోర్సులపై పలు పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విశాఖ విమానాశ్రయం ఇన్‌చార్జ్ డైరెక్టర్ ఎన్.పురుషోత్తం మాట్లాడుతూ యాత్రి సేవా దివాస్ కార్యక్రమం ప్రయాణికులకు ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. విజయవంతం చేసిన ఉద్యోగులను, సిబ్బందిని అభినందించారు.

ఎయిర్‌పోర్టులో ఘనంగా యాత్రి సేవా దివాస్