
నేల పరీక్షలను అడ్డుకున్న దళిత రైతులు
తగరపువలస : ఆనందపురం మండలం తర్లువాడ పంచాయతీ సర్వే నంబర్ 1లో 35/71/72/74/75లో తమకు చెందిన డి పట్టా భూములను కూటమి ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని దళిత రైతులు వాపోయారు. బుధవారం నేల పరీక్షలకు యంత్రాలతో వచ్చిన వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 1971లో అప్పటి ప్రభుత్వం 51 మంది దళితులతో పాటు బీసీ రైతులకు 2 ఎకరాల చొప్పున భూమి కేటాయించిందన్నారు. అప్పటి నుంచి ఈ భూములతో పాటు చుట్టుపక్కల ఉన్న బంజరు భూముల్లో జీడి, మామిడి, అరటి వంటి తోట పంటలు సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నామన్నారు. వ్యవసాయానికి అనువుగా ప్రభుత్వాలు బోరుబావులు, విద్యుత్ మోటార్లు, సోలార్ కనెక్షన్లు కూడా ఇచ్చాయన్నారు. గతంలో భీమిలి ఆర్డీవో, ఆనందపురం తహసీల్దార్ పంచాయతీకి వచ్చి గ్రామసభ నిర్వహించారన్నారు. రైతుల సాగులో ఉన్న భూములు, సర్వే నంబర్లు వేర్వేరుగా ఉన్నందున సరి చేసి ఇస్తామని నమ్మబలికారన్నారు. తరువాత ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకుంటామనగా దళిత వార్డు సభ్యులు పైల బంగారమ్మ, కోండ్రు శంకర్ తదితరులు వ్యతిరేకించారన్నారు. అంతకు ముందే ఎకరాకు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. వారం రోజుల క్రితం వచ్చిన అధికారులు 350 ఎకరాల వరకు గూగుల్ తదితర సంస్థలకు తమకు చెందిన డీ పట్టా భూములు, బంజురు భూములను ఇవ్వనున్నట్టు తెలిపారన్నారు. అందులో భాగంగా బుధవారం నేల పరీక్షలకు వచ్చిన వారిని అడ్డుకున్నామన్నారు. తమకు ఈ భూములు పోతే భవిష్యత్తు ఉండదని ఉద్యోగాలు, నష్టపరిహారం తగినంతగా ఇస్తే తప్ప భూములు వదులుకోమని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు. ఈ సందర్భంగా తాత్కాలికంగా నేల పరీక్షలు వాయిదా వేసుకుని అధికారులు వెళ్లిపోయారు.