పరవాడ: మండలంలోని ముత్యాలమ్మపాలెం శివారు జాలారిపేటకు చెందిన ఒలిశెట్టి కోదండ ఆయన భార్య లక్ష్మి(45)పై అనుమానం పెంచుకుని, మద్యం మత్తులో బుధవారం ఉదయం దారుణంగా కొట్టి, చాకుతో పొడిచి హత్య చేసినట్లు పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు చెప్పారు. హత్యకు సంబంధించి స్థానికులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఒలిశెట్టి కోదండ ఆముదాలవలస ప్రాంతానికి చెందిన హతురాలు లక్ష్మిని మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుని, జాలారిపేటలో చేపల వేట సాగిస్తూ జీవిన్నాడు. మంగళవారం వేటాడిన చేపల్ని విక్రయించగా వచ్చిన సొమ్ముతో రెండు రోజులుగా మద్యం సేవిస్తున్నాడు. కోదండతో పాటు భార్య లక్ష్మి కూడా మద్యం సేవిస్తుంటుందని స్థానికులు చెప్తున్నారు. భార్యపై అనుమానం కూడా ఉండేదని పేర్కొన్నారు.
ఈ క్రమంలో బుధవారం ఉదయం మద్యం సేవించిన కోదండ.. భార్య లక్ష్మితో తన ఇంటి ముందు గొడవపడ్డాడు. కర్రతో కొట్టుకుంటూ ఇంటిలోపలికి తీసుకెళ్లి చాకుతో పొడవడంతో లక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. నిందితుడు కోదండకు ఆమె మూడవ భార్య. ఈయన ప్రవర్తన బాగాలేక మొదటి భార్య విడిచిపెట్టి వెళ్లిపోయింది. అనంతరం పూడిమడకకు చెందిన ఒకామెను వివాహం చేసుకోగా ఆమె పట్ల కూడా అనుచితంగా ప్రవర్తించడంతో ఆత్మహత్యకు పాల్పడింది.
ఆ తరువాత ఆముదాలవలస ప్రాంతానికి చెందిన హతురాలు లక్ష్మిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. హత్య విషయాన్ని తెలుసుకున్న సీఐ మల్లికార్జునరావు ఘటనా స్థలికి చేరుకుని హత్యకు సంబంధించిన వివరాలను సేకరించారు. హతురాలు లక్ష్మికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హత్యకు పాల్పడిన కోదండను అదుపులోకి తీసుకుని, కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నామని సీఐ మల్లికార్జునరావు చెప్పారు.