
‘మూర్తియాదవ్ వేధింపులపై ఆర్పీల నిరసన’
బీచ్‌రోడ్డు: వ్యక్తిగత కక్షలతో జనసేన పార్టీకి చెందిన 22వ వార్డు కార్పొరేటర్ మూర్తి యాదవ్ తమను రాజకీయంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఏపీ మెప్మా ఆర్పీ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కమిటీ సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించింది. యూనియన్ గౌరవాధ్యక్షురాలు పి. మణి మాట్లాడుతూ కార్పొరేటర్ వేధింపుల కారణంగా తొలగించిన ఐదుగురు ఆర్పీలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే తమ సమస్యలను ప్రశ్నించినందుకు యూనియన్ ప్రధాన కార్యదర్శి ఝాన్సీ, కోశాధికారి సత్య వరలక్ష్మిలను తొలగించాలని కార్పొరేటర్ పీడీ, ఏపీడీపై ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆరోపించారు. మూర్తి యాదవ్‌ను ఎవరైనా విమర్శిస్తే తట్టుకోలేడని, వారి అంతుచూస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడని ఆరోపించారు. ఈయన వ్యవహారంపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.
మూడు నెలల బకాయి జీతాలను వెంటనే ప్రభుత్వం చెల్లించాలని, పని భారాన్ని తగ్గించాలని, ఉద్యోగ భద్రతకు భంగం కలిగించే సర్క్యులర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో యూనియన్ అధ్యక్షులు ఎస్. లక్ష్మి, ఝాన్సీ, సత్య వరలక్ష్మి, ముఖ్య నాయకులు సుధా, వందన, ధనలక్ష్మి, లక్ష్మీ, దేవి, నూకరత్నం, జయ, మల్లీశ్వరి లత, చంద్రకళ, త్రివేణి, రామలక్ష్మి, గాయత్రి, హిమబిందు, విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు.