
కాంట్రాక్ట్ కార్మికులను చేర్చుకోవాల్సిందే..
ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను చేర్చుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. కార్మికులను చేర్చుకోవాలన్న డిమాండ్‌పై సోమవారం కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉక్కు ట్రైనింగ్ విభాగం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సేఫ్టీ శిక్షణ కోసం వచ్చిన ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎటువంటి కారణాలు లేకుండా కార్మికులను తొలగించడం దుర్మార్గమన్నారు. తొలగించడానికి కారణాలు చెప్పకుండా ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. ఇదే వైఖరి కొనసాగితే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. కార్మిక నాయకులు మంత్రి రాజశేఖర్, డి.ఆదినారాయణ వారి ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అక్కడ పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున మోహరించారు. కార్యక్రమంలో నమ్మి రమణ, భాస్కరరావు, ఉమ్మిడి అప్పారావు, మంత్రి రవి, వంశీకృష్ణ, కోన రమణ పాల్గొన్నారు.