
భద్రతలో జాగిలాల పాత్ర కీలకం
విశాఖ సిటీ : ప్రముఖుల భద్రతతో పాటు గంజాయి, డ్రగ్స్ రవాణా అడ్డుకట్ట వేయడం, అసాంఘిక కార్యక్రమాల నియంత్రణలో జాగిలాల పాత్ర కీలకమని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆర్మర్డ్ రిజర్వ్ మైదానంలో జీవీఎంసీ సహకారంతో రూ.18 లక్షలతో నిర్మించిన జాగిలాల వసతి గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాగిలాల ఆరోగ్య సంక్షరణపై పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి చర్యలు తీసుకోవడం గొప్ప విషయమన్నారు. రానున్న రోజుల్లో కూడా పోలీస్ శాఖకు సహకారం అందించేందుకు బీచ్ రోడ్డులో నిఘా కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గోవా తరహాలో విశాఖ బీచ్‌లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ రాష్ట్రంలో 21 జాగిలాలు ఉన్న జిల్లాగా విశాఖ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. గతేడాది జిల్లా కలెక్టర్ నాలుగు, జీవీఎంసీ కమిషనర్ 4 జాగిలాలను స్పాన్సర్ చేశారన్నారు. గత నెలాఖరు నాటికి ఎనిమిది జాగిలాలు శిక్షణ పూర్తి చేసుకుని విశాఖ నగరానికి రిపోర్టు చేసినట్లు చెప్పారు. శిక్షణలో భాగంగా విశాఖకు చెందిన జాగిలం లైకా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ప్రస్తుతం నగరంలో 10 నార్కోటిక్ డాగ్స్ ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఏడీసీపీలు, ఏపీసీలు, డాగ్ కెన్నల్స్ సిబ్బంది పాల్గొన్నారు.