
దివ్యాంగుల జీవితాలతో ఆడుకోవద్దు
కలెక్టరేట్ వద్ద వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకుల ఆందోళన
మహారాణిపేట: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దివ్యాంగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని, సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ దివ్యాంగులు సోమవారం కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం సదరం సర్టిఫికెట్ల రీ–వెరిఫికేషన్‌కు ఆదేశాలు ఇవ్వడం దివ్యాంగుల జీవితాలపై పిడుగుపాటు లాంటిదని వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రీ–వెరిఫికేషన్ ప్రక్రియలో వైకల్యం శాతం తగ్గించడం.. సర్టిఫికెట్ రద్దు చేయడం వంటివి జరిగితే తాము పింఛన్లు కోల్పోతామని దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు. వీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎత్తుల డేవిడ్ రాజు మాట్లాడుతూ, అర్హులైన దివ్యాంగులందరికీ పింఛన్లు యథావిధిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సదరం సర్టిఫికెట్లలో వైకల్య శాతాన్ని తగ్గించవద్దని, 2010 నుంచి ఉన్న సర్టిఫికెట్లను మార్చవద్దని ఆయన కోరారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు అక్కిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ దివ్యాంగులకు ఇస్తున్న పింఛన్లు యాథావిధిగా ఇవ్వాలన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో జిల్లా రెవెన్యూ అధికారికి వీహెచ్‌పీఎస్ నాయకులు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీఎస్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఎస్. మల్లేశ్వరి, దివ్యాంగులు పాల్గొన్నారు.