
హాస్టల్ విద్యార్థులకు వైద్య పరీక్షలు
ఎంవీపీకాలనీ: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు సామూహికంగా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రామారావు తెలిపారు. జిల్లాలోని ఆయా వసతి గృహాల్లో జరిగిన వైద్య శిబిరాల వివరాలను శనివారం ఆయన వెల్లడించారు. ప్రతి విద్యార్థి సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండాలనే లక్ష్యంతో కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో శనివారం వైద్య శిబిరాలు నిర్వహించినట్లు చెప్పారు. డీఎంహెచ్‌వో ఆదేశాలతో స్థానిక యూపీహెచ్‌వోల వైద్య అధికారులు, సిబ్బంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారన్నారు. 3వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు సుమారు 5,500 మంది విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా ఈ సేవలు వినియోగించుకున్నారని తెలిపారు. వైద్య సేవలతోపాటు విద్యార్థులకు ఆహారం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించామన్నారు.