
ఇంటి యజమానే దొంగ
అద్దెకు ఉన్న వారింట్లో చేతివాటం ప్రదర్శించిన మహిళ 200 గ్రాముల బంగారం, 40 తులాల వెండి చోరీ రెండున్నరేళ్ల తర్వాత కేసును చేధించిన పెందుర్తి పోలీసులు మరో కేసులో మరో నిందితుడి అరెస్ట్
పెందుర్తి: తన ఇంట్లో అద్దెకు ఉంటున్న వారి ఇంటినే గుళ్ల చేసింది ఓ ప్రబుద్ధురాలు. తమ ఇంట్లో అద్దెకు ఉన్న వారు లేని సమయం చూసుకుని భారీ ఎత్తున బంగారం, వెండి దోచుకుపోయింది. రెండున్నరేళ్ల పాటు ఆ ‘ఇంటి’ దొంగ తప్పించుకు తిరిగింది. చివరకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు చిన్నపాటి ఆధారంతో చాకచక్యంగా వ్యవహరించి కేసును చేధించడంతో దొంగ దొరికేసింది. పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో వెస్ట్ జోన్ క్రైం విభాగం సీఐ ఎన్.శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. పరవాడలోని అరబిందో ఫార్మా కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కొయ్యన రమేష్ జీవీఎంసీ 88వ వార్డు సతివానిపాలెంలో చిన్నపల్లి ధర్మారావు ఇంట్లో అద్దెకు దిగారు. ఈ క్రమంలో 2023 ఫిబ్రవరి 22న రమేష్ భార్యతో కలిసి అత్తారింటికి వెళ్లాడు. తిరిగి నాలుగు రోజుల తరువాత ఇంటికి వచ్చాడు. మరుసటి రోజు ఓ శుభకార్యానికి వెళ్లేందుకు ఇంట్లో నగదు వేసుకునేందుకు రమేష్ భార్య సిద్ధమైంది. బీరువాలోని బంగారం కనిపించకపోవడంతో భర్తను అడిగింది. అయితే తాను బంగారం ఎక్కడో పెట్టి మరిచిపోయాననుకుని భార్యకు సర్ది చెప్పేవాడు. కొన్నాళ్ల పాటు వెతికి చివరకు రెండేళ్ల క్రితం పోలీసులను ఆశ్రయించారు. ఎంత ప్రయత్నం చేసినా ఆధారాలు లేక కేసు దాదాపు నీరు గారిపోయింది. మరోసారి బాధితులు పెందుర్తి పోలీసులను ఆశ్రయించి ఈ నెల 2న ఫిర్యాదు చేశారు. దీంతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రైం విభాగం పోలీసులు రంగంలోకి దిగి ఆధారాలు సేకరించారు. చివరకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తమదైనశైలిలో అనుమానితురాలైన ఇంటి యజమాని భార్య చిన్నపల్లి సుజాత ప్రశ్నించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకుందని సీఐ వెల్లడించారు. నిందితురాలిని అరెస్ట్ చేసి రూ.15 లక్షల విలువైన 200 గ్రాముల బంగారం, 40 తులాల వెండి సామగ్రి స్వాధీనం చేసుకున్నామన్నారు.
● పెందుర్తి భాష్యం పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న రాయుడు దుర్గాభవాని జూన్ 24న తన భర్త దుర్గాప్రసాద్ క్లర్క్‌గా పనిచేస్తున్న గోపాలపట్నంలోని కో ఆపరేటివ్ బ్యాంక్‌లో తనఖాలో ఉన్న బంగారాన్ని విడిపించారు. అనంతరం ఆటోలో పెందుర్తి వస్తుండగా బంగారం ఉంచిన బ్యాగ్ మాయమైంది. దీంతో జూలై 8న ఆమె పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం ముసిరాం గ్రామానికి చెందిన మాకిరెడ్డి గణేష్ అలియాస్ గని చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. రూ.5 లక్షల విలువైన ఆరున్నర తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు సీఐ పేర్కొన్నారు. ఆయా కేసుల్లో ప్రతిభ కనబరిచిన ఎస్‌ఐ డి.సూరిబాబు, ఏఎస్‌ఐ కె.శ్రీనివాసరావు, హెచ్‌సీ జి.నాగరాజు, పీసీలు టి.పద్మజ, టి.శివప్రసాద్, ఎల్.కె తాతారావు, బి.దేముడునాయుడు, యూ.చంద్రకళను ఉన్నతాధికారులు అభినందించారు.