
స్విగ్గీ, జొమాటో రైడర్ల నిరసన
సీతంపేట: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్విగ్గీ, జొమాటో రైడర్లు నగరంలోని డైమండ్ పార్కు, మధురవాడ, గాజువాక, ఎన్‌ఏడీ, పెందుర్తి ప్రాంతాల్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గిగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బి.జగన్ మాట్లాడుతూ.. జిల్లాలో దాదాపు 40 వేల మంది యువత స్విగ్గీ, జొమాటో వంటి ఫ్లాట్‌ఫాంలలో పనిచేస్తున్నారని తెలిపారు. వారికి ఉద్యోగ భద్రత, స్థిరమైన ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అక్రమంగా తొలగించిన ఐడీలను తిరిగి పునరుద్ధరించాలని, 8 గంటలు ఆన్‌లైన్‌లో ఉంటే కనీస హామీ ఆదాయం చెల్లించాలని, సంవత్సరం పొడవునా ఒకే రకమైన రేటు కొనసాగించాలని, ఇన్సెంటివ్, ఒక కిలోమీటరుకు ఎంత రేటు ఇస్తారో యాప్‌లో స్పష్టంగా చూపించాలని, బేస్ పేను రూ. 30కి పెంచాలని, గతంలో ఇచ్చిన విధంగా పీక్ అవర్స్‌లో రూ. 12, నాన్–పీక్ అవర్స్‌లో రూ. 10 ఇన్సెంటివ్ ఇవ్వాలని, ఇన్సెంటివ్ కోసం రెండు పిక్స్ తప్పనిసరి చేయకూడదని డిమాండ్ చేశారు. ఏడేళ్ల కిందట లీటరు పెట్రోల్ ధర రూ.76 ఉన్నప్పుడు ఆదాయం బాగా వచ్చేదని, ఇప్పుడు లీటరు రూ. 108కి పెరిగిందని, కానీ ఆదాయం మాత్రం పెరగలేదని జగన్ వివరించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, లాగిన్ గంటలు, ఆర్డర్లు పెరిగినా ఆదాయం మాత్రం పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైడర్లకు ఏదైనా సమస్య వస్తే దానిని పరిష్కరించడానికి సంస్థ తరపున ఒక ప్రతినిధి అందుబాటులో ఉండాలని ఆయన కోరారు.
ఉద్యోగ భద్రత, ఆదాయం పెంచాలని డిమాండ్