
మహాకవి ఆరుద్ర సాహిత్యం అజరామరం
సీతంపేట: మహాకవి ఆరుద్ర బహుముఖ ప్రజ్ఞాశాలి అని, సాహిత్యంలో ఆయన స్పృశించని పార్శ్వం అంటూ ఏదీ లేదని పలువురు రచయితలు, సాహితీవేత్తలు కొనియాడారు. కేంద్ర సాహిత్య అకాడమీ, రైటర్స్ అకాడమీ సంయుక్తంగా శనివారం ద్వారకానగర్‌లోని పౌర గ్రంథాలయంలో ఆరుద్ర శతజయంతి సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రసిద్ధ రచయిత మేడిపల్లి రవికుమార్ మాట్లాడుతూ కలం ప్రజల కోసం, కల కోసం కాదు అని నమ్మిన మహోన్నత వ్యక్తి ఆరుద్ర అని కొనియాడారు. ‘కవిత కోసం పుట్టాను, సామాజిక క్రాంతి కోసం కలం పట్టాను’అని ఆరుద్ర అన్నారని గుర్తు చేశారు. విశాఖలో పుట్టిన ఆరుద్ర శతజయంతి సభ ఇక్కడే నిర్వహించడం సముచితమన్నారు. ఆరుద్ర తన ఇంటి పేరు, కులం పేరు వదిలిపెట్టి తనని తాను నిరూపించుకున్నారని తెలిపారు. జమీందారీ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. శ్రామిక వర్గం వైపు ఆరుద్ర నిలబడ్డారని వివరించారు.
యువతకు ఆరుద్ర గొప్పతనం తెలిసేలా..
సాహిత్య అకాడమీ కన్వీనర్ సి.మృణాళిని మాట్లాడుతూ ఆరుద్ర వంటి కవుల శతజయంతి సభలు నిర్వహించడం ద్వారా నేటి తరానికి ఆయన గొప్పతనం తెలుస్తుందన్నారు. రైటర్స్ అకాడమీ అధ్యక్షుడు వి.వి.రమణమూర్తి మాట్లాడుతూ.. ఇటువంటి సభల ద్వారా భావితరాలకు గొప్ప కవుల రచనలు అందించి, మరికొంతమంది రచయితలను ఆ స్థాయికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఆచార్య బాబీ వర్ధన్ మాట్లాడుతూ ఆరుద్ర కేవలం కవిగా మాత్రమే కాకుండా కథ, వ్యాసం, పరిశోధన, నాటకం, నవల, డిటెక్టివ్ నవల, సినిమా పాటలు, నృత్యం, నటన, సంగీతం వంటి అన్ని రంగాలలో నిష్ణాతుడని పేర్కొన్నారు. రచయిత చింతకింది శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆరుద్ర గొప్ప పరిశోధకుడని, ‘సమగ్రాంధ్ర సాహిత్యం’ వంటి రచనల ద్వారా భావితరాలకు సాహిత్య సంపదను అందించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. మేడా మస్తాన్‌రెడ్డి, గాంధీ సెంటర్ అధ్యక్షుడు వి.బాలమోహన్‌దాస్, ఉస్మా నియా యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ ఎస్.రఘు, రచయితలు తలతోటి పృథ్వీరాజు, అయ్యగారి సీతారత్నం, అనిల్ డ్యానీ, రాంభట్ల నృసింహశర్మ, బాల సుధాకర్, మౌళి, బులుసు వెంకటేశ్వర్లు, కె.వి.ఎస్.మూర్తి, అనూరాధ, విజయ్ కుమార్ పాల్గొన్నారు.