
భూ సేకరణ, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి చర్యలు
● 2026 నాటికి పూర్తి స్థాయిలో మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధి ● వివిధ సమీక్ష సమావేశాల్లో కలెక్టర్ హరేందిర ప్రసాద్
మహారాణిపేట: జిల్లాలో మెట్రో రైల్, రైల్వే లైన్ విస్తరణ, గ్యాస్ పైప్‌లైన్, మాస్టర్‌ప్లాన్ రోడ్ల అభివృద్ధి, కన్వెయన్స్ డీడ్ పట్టాలు పొందిన లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ తదితర అంశాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లో వీఎంఆర్డీఏ, జీవీఎంసీ, రెవెన్యూ అధికారులతో వేర్వేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులకు భూ సేకరణతోపాటు, పరిహారం కూడా త్వరగా అందించాలన్నారు. పెందుర్తి, సింహాచలం నార్త్ స్టేషన్ మధ్య నిర్మించాల్సిన ఫ్లైఓవర్ నిర్మాణం, దువ్వాడ సింహాచలం లైన్ల మధ్య చేపట్టాల్సిన అభివృద్ధి పనుల భూ సేకరణపై చర్చించారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్–1లో భాగంగా మూడు కారిడార్లలో చేపట్టనున్న పనులకు సంబంధించి ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఇంకా మిగిలి ఉన్న ఐవోసీ గ్యాస్ పైప్‌లైన్ల ఏర్పాటుకు జీవీఎంసీ, వీఎంఆర్డీఏతో అధికారులు సహకరించి పెండింగ్ అనుమతులు త్వరగా మంజూరు చేయాలన్నారు.
● వీఎంఆర్డీఏ పరిధిలో చేపట్టాల్సిన 25 మాస్టర్ ప్లాన్ రోడ్లపై సమీక్షించారు. భూ సేకరణ, టెండర్లు, టీడీఆర్‌ల జారీని పారదర్శకంగా నిర్వహించాలన్నారు. సెప్టెంబర్ రెండో వారం నుంచి పనులు ప్రారంభించి, 2026 జూన్/జూలై నాటికి రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చేలా చూడాలన్నారు.
● వివిధ మార్గాల్లో కన్వెయన్స్ డీడ్ పట్టాలు పొందిన లబ్ధిదారులకు వేగంగా రిజిస్ట్రేషన్లు చేయాలని జోనల్, మండల స్థాయి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రోజుకు 30 రిజిస్ట్రేషన్లు చేయాలనే లక్ష్యం పెట్టుకుని, రెండు నెలల్లో పూర్తి చేయాలన్నారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.30, 45ల ద్వారా నిర్వహిస్తున్న భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియతోపాటు వీటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జీవో నెం.296 ప్రకారం పట్టాలు పొందిన లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ల గురించి ఆరా తీశారు. సమావేశాల్లో వీఎంఆర్డీఏ కమిషనర్ కేఎస్ విశ్వనాథన్, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్, డీఆర్వో భవానీ శంకర్, ఆర్డీవోలు సంగీత మాధూర్, శ్రీలేఖ, భూ సేకరణ అధికారులు, తహసీల్దార్లు, ఐవోసీఎల్, మెట్రో రైల్, రైల్వే, జీవీఎంసీ, ల్యాండ్ సెక్షన్, యూఎల్‌సీ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.