
7 జట్లు.. 25 మ్యాచ్‌లు
● నేటి నుంచి ఏపీఎల్ సీజన్ ప్రారంభం
● కాకినాడ కింగ్స్, అమరావతి రాయల్స్ మధ్య తొలి మ్యాచ్
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) నాలుగో సీజన్‌కు వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం సిద్ధమైంది. శుక్రవారం ప్రారంభం కానున్న టీ20 లీగ్‌లో ఈసారి ఏడు ఫ్రాంచైజీ జట్లు ట్రోఫీ కోసం పోటీపడనున్నాయి. మొత్తంగా 25 మ్యాచ్‌లు నిర్వహించనుండగా టైటిల్ పోరు ఈనెల 23న జరగనుంది. రోజుకు రెండు మ్యాచ్‌లు చొప్పున జరగనుండగా అభిమానులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నట్లు ఏపీఎల్ నిర్వాహక కమిటీ చైర్మన్ వీఎస్‌కే రంగారావు తెలిపారు. సినీనటుడు వెంకటేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రారంభ వేడుకలో సినీనటి ప్రజ్ఞాజైస్వాల్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ ప్రదర్శన ఇవ్వనుండగా డ్రోన్, లేజర్‌షో అలరించనున్నాయి. ప్రారంభ వేడుకకు కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు హాజరై కాకినాడ కింగ్స్, అమరావతి రాయల్స్ మధ్య మ్యాచ్‌ను టాస్ వేసి ప్రారంభించనున్నారు. ఈ మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్ లైవ్ అందించనుంది.