
క్రీడలతో స్నేహ సంబంధాలు బలోపేతం
విశాఖ లీగల్ : క్రీడలు మనుషుల మధ్య పోటీతత్వాన్ని పెంచి మంచి ఫలితాలు అందిస్తాయని గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ అన్నారు. గురువారం జిల్లా కోర్టు ఆవరణలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా క్రీడా సాంస్కృతిక వేడుకలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ న్యాయవాదులు నిరంతర కార్యశీలురని, వారికి ఆటవిడుపుగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం చాలా అవసరమన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య మంచి వాతావరణాన్ని కలిగించడానికి ఈ వేడుకలు ఎంతో ఉపకరిస్తాయన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్, రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు సిరిపురపు కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈత పోటీల్లో జాతీయ స్విమ్మర్ న్యాయవాదుల సంఘం క్రీడా సాంస్కృతిక సంఘం కార్యదర్శి బాలాజీ, సంఘం సీనియర్ సభ్యుడు ఆడారి అప్పారావు, భారీ సంఖ్యలో న్యాయవాదులు న్యాయమూర్తులు పాల్గొన్నారు.