
ఫ్రీ బస్ అమలుకు సర్వం సిద్ధం
● పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో, ఆర్డినరీ బస్సుల్లో ఉచితం ● మీడియాతో ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు
మహారాణిపేట: ఈ నెల 15 నుంచి రాష్ట్రంలో సీ్త్ర శక్తి పథకం పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఏపీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు, చైర్మన్ కొనకళ్ల నారాయణ, జోనల్ చైర్మన్ దొన్నుదొర తెలిపారు. ద్వారకా బస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలు ఎక్కడ నుంచి ఎక్కడికై నా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్టినరీ, మెట్రో బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఆధార్, ఓటర్ ఐడీ, ఇతర గుర్తింపు కార్డులు తప్పనిసరిగా చూపాలని పేర్కొన్నారు. త్వరలో మరో 1050 కొత్త బస్సులు రానున్నాయని, ఏటా డీజిల్ బస్సుల స్థానంలో కొత్త ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆర్టీసీ చైర్మన్ నారాయణ మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం ప్రారంభిస్తున్న ఈ పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు అదనపు బస్సులు, సిబ్బందిని సమకూర్చినట్లు పేర్కొన్నారు. తొలి రోజుల్లో ఎదురయ్యే సమస్యల్ని పరిగణనలోకి తీసుకుని దిద్దుబాటు చేసుకుంటామన్నారు. జోనల్ చైర్మన్ దొన్ను దొర మాట్లాడుతూ రాష్ట్రంలో బస్సు ప్రయాణికుల మొత్తం సంఖ్యలో 76 శాతం మంది మహిళలకు ఈ పథకం ఉపయుక్తంగా ఉంటుందన్నారు. సమావేశంలో జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) ఎ.అప్పలరాజు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఇంజినీరింగ్) టి.చెంగలరెడ్డి, విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.