
అనైతిక రాజకీయాలకు కూటమి తెర ?
● స్టాండింగ్ కమిటీ ఎన్నికలో ప్రలోభాలు ● 27 మంది ఫిరాయింపు కార్పొరేటర్లకు నిబంధనలకు విరుద్ధంగా ఓటు హక్కు ● ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న అధికారులు, కూటమి నేతలు ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు
సాక్షి, విశాఖపట్నం: జీవిఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక నేపథ్యంలో కూటమి నేతలు అనైతిక రాజకీయాలకు తెర లేపుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. మంగళవారం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జీవీఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీలో గెలిచిన 27 మంది కార్పొరేటర్లు నిబంధనలకు విరుద్ధంగా ఫిరాయింపునకు పాల్పడ్డారని, వారికి స్టాడింగ్ కమిటీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికే విరుద్ధంగా ఓటు హక్కు కల్పిస్తున్నారంటూ మండిపడ్డారు. అంతేకాకుండా బుధవారం జరగనున్న జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేయడమే కాకుండా ఓటుకు నోటు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. ఓటమి భయంతో అనైతిక పద్ధతిలో విజయం సాధించేందుకు క్యాంపు రాజకీయాలకు, ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కూటమి నేతలు, అధికారులు ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారని, ఫిరాయింపుదారులకు ఓటు హక్కు తొలగించి స్టాండింగ్ కమిటీ ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతో కార్పొరేటర్లను ఒక ప్రైవేట్ రిసార్ట్‌కు తరలించారన్నారు.