
మరణించి.. ఇద్దరికి కంటి వెలుగై..
పెందుర్తి: ఓ పెద్దాయన మరణించి ఇద్దరికి కంటి చూపును అందించారు. వివరాలివి.. ఆనందపురం మండలం శొంఠ్యాం గ్రామానికి చెందిన గవర పోలిపిల్లి(65) గుండెపోటుతో మంగళవారం ఉదయం మరణించారు. కుమారులు ఇద్దరూ ఉద్యోగ రీత్యా దూరంగా ఉండడంతో పోలిపిల్లి మృతదేహాన్ని భద్రపరిచేందుకు ఫీజర్ బాక్స్ కోసం పెందుర్తికి చెందిన సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి దాడి శ్రీనివాస్‌ను మృతుని కుమారుడు సంప్రదించారు. ఈ క్రమంలో నేత్రదానం కోసం శ్రీనివాస్ ప్రతిపాదించగా కుమారులు అంగీకారం తెలిపారు. అనంతరం ఎల్వీ ప్రసాద్ మొహిషిన్ ఐ బ్యాంక్ ప్రతినిధులు మృతుడి నేత్రాలను సేకరించి ఐ బ్యాంక్‌కు తరలించారు. ఆరోగ్య సమస్యలు లేకపోతే మరణించిన ఏ వయసు వారి నేత్రాలైనా కనీసం ఇద్దరికి చూపును అందిస్తాయని ఈ సందర్భంగా సాయి ట్రస్ట్ ప్రతినిధి శ్రీనివాస్ తెలిపారు.