
అప్పన్న లడ్డూ నాణ్యత పెంపుపై ట్రయల్ రన్
● త్వరలో 400 గ్రాముల కల్యాణ లడ్డూ విక్రయాలు ● ఈవో వి.త్రినాథరావు వెల్లడి
సింహాచలం: రాష్ట్రవ్యాప్తంగా లడ్డూ ప్రసాదం అందించే ప్రధాన దేవాలయాల్లో లడ్డూ నాణ్యత మరింతగా పెంపొందించేందుకు, ఒకే విధమైన నాణ్యత ఉండేలా అన్ని దేవాలయాల్లో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు సింహాచలం దేవస్థానం ఈవో వి.త్రినాథరావు తెలిపారు. సింహగిరిపై ప్రసాదాల తయారీశాలలో ఈవో స్వీయ పర్యవేక్షణలో లడ్డూ తయారీని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో ఈవో మాట్లాడుతూ రాష్ట్రంలో లడ్డూ ప్రసాదం అందించే ప్రధాన దేవాలయాల్లో విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఉన్న దిట్టాన్ని(ముడిసరకుల కొలత) ఇప్పటి వరకు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక దిట్టానికి పది కిలోల శెనగపిండి, 20 కిలోల పంచదార, 6 కిలోల నెయ్యి, 750 గ్రాముల జీడిపప్పు, కిస్మిస్ 500 గ్రాములు, యాలకులు 75 గ్రాములు,జాజికాయ,పచ్చకర్పూరం 15 గ్రాములు చొప్పున వినియోగిస్తున్నామన్నారు. ఒక దిట్టానికి 80 గ్రాముల లడ్డూలు 510 వస్తాయన్నారు. ఈ తరుణంలో నాణ్యతను మరింతగా పెంచేందుకు ఇంకా ఏమైనా అదనంగా ముడిసరుకులు అవసరమా.. అన్న విషయంపై దేవదాయశాఖ కమిషన్ ఆదేశాలతో ప్రతీ దేవాలయంలో ట్రయల్‌రన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సింహాచలంలో ప్రధానంగా మూడు దిట్టాలతో లడ్డూ లను తయారుచేసి పరిశీలించినట్లు పేర్కొన్నారు. తొలి దిట్టంతో లడ్డూ పాకం తీసేసరికి 9.330 కిలోల నెయ్యి అవసరమైందని, నాలుగైదు పాకాలు తయారయ్యాక నెయ్యి వినియోగం తగ్గుతూ ఉంటుందన్నారు. దీంతో ఒక దిట్టం లడ్డూల తయారీకి 6 కిలోల నెయ్యి సరిపోతుందా? లేక అదనంగా అవసరమవుతుందా? అన్న విషయంపై కమిషనర్‌కి నివేదిక పంపించనున్నట్లు తెలిపారు. ప్రధాన దేవాలయాల్లో రిపోర్టులన్నీ పరిశీలించిన తర్వాత కమిషనర్ ఒక నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. సింహాచలం దేవస్థానంలో ఇప్పటి వరకు 400 గ్రాముల కల్యాణ లడ్డూను కేవలం నిత్యకల్యాణంలో పాల్గొనే భక్తులకే అందిస్తున్నామని, త్వరలో భక్తుల సౌకర్యార్థం కౌంటర్లలో కూడా విక్రయాలు జరుపుతామన్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఏఈవో వీబీవీ రమణమూర్తి, సూపరింటెండెంట్ పాలూరి నరసింగరావు పాల్గొన్నారు.