
నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించండి
ప్రొబేషనరీ ఎస్‌ఐలతో సీపీ
విశాఖ సిటీ : క్షేత్ర స్థాయిలో విధి నిర్వహణ, పోలీస్ స్టేషన్‌లో రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తుపై అవగాహన పెంచుకోవాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ప్రొబేషనరీ ఎస్‌ఐలకు దిశా నిర్దేశం చేశారు. నగరానికి కేటాయించిన 34 ప్రొబేషనరీ ఎస్‌ఐలు గురువారం సీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారితో సీపీ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, సేవాతత్పరతతో పనిచేయాలని సూచించారు. కష్టపడి పనిచేస్తూ పోలీస్ శాఖకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులతో వినయంగా ప్రవర్తిస్తూ వారికీ న్యాయం చేయాలని చెప్పారు. విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. దర్యాప్తులో సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. సమావేశంలో డీసీపీ–1 అజితా వేజెండ్ల, డీసీపీ–2 డి.మేరి ప్రశాంతి, డీసీపీ(అడ్మిన్) కృష్ణ కాంత్ పటేల్, డీసీపీ(క్రైమ్స్) కె.లతా మాధురి ఇతర అధికారులు పాల్గొన్నారు.