
రుణాల మంజూరులో బ్యాంకర్లదే కీలక పాత్ర
మహారాణిపేట: సామాన్యులు, రైతుల ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చడంలో బ్యాంకర్లు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన సమీక్షలో వివిధ బ్యాంకుల ప్రతినిధులు, అధికారులతో ఆయన మాట్లాడారు. వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం సేవలను మరింత విస్తరించాలని, రుణ మంజూరు ప్రక్రియలో సరళతర విధానాలు పాటించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందించే రుణాలను సకాలంలో రెన్యూవల్ చేయాలన్నారు. వారి పొదుపు ఖాతాలోని 50 శాతం సొమ్మును ఆటోమేటిక్‌గా ఎఫ్‌డీ చేయాలని ఆదేశించారు. రైతులు, ఎం.ఎస్.ఎం.ఈ. ఔత్సాహికులకు అండగా నిలవాలని, రుణ ప్రక్రియలో సరళతర విధానాలు అవలంబించాలని సూచించారు. వ్యవసాయ, విద్యా రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
పథకాలపై లబ్ధిదారులకు అవగాహన
బ్యాంకింగ్ సేవలపై, సైబర్ మోసాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, తగిన సహకారం అందించాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయాధారిత పథకాలు, కిసాన్ క్రెడిట్ పథకం, పీఎం స్వానిధి, పీఎంఈజీపీ, స్టాండ్ అప్ ఇండియా, నేషనల్ అర్బన్, రూరల్ లైవ్లీహుడ్ మిషన్, బీసీ, ఎస్సీ, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా అందే రుణ పథకాలు, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, అగ్రి క్లినిక్ – అగ్రి బిజినెస్ సెంటర్ల ఆవశ్యకతపై సంబంధిత లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు.పీఎం సూర్యఘర్ పథకానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆగస్టు 15వ తేదీ లోగా కిసాన్ క్రెడిట్ పథకం, మత్స్యకార సేవా పథకాల కార్డుల జారీకి సంబంధించిన ప్రక్రియలను పూర్తి చేయాలని ఆదేశించారు. లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ సత్తిబాబు, యూసీడీ పీడీ సత్యవాణి, డీఆర్డీఏ పీడీ లక్ష్మీపతి, నాబార్డు ఏజీఎం బసంత్ కుమార్, మత్స్యశాఖ, పశుసంవర్ధక, వ్యవసాయ శాఖ జేడీలు లక్ష్మణరావు, కరుణాకరరావు, అప్పలస్వామి పాల్గొన్నారు.