
స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థి మృతి
పీఎం పాలెం: బస్సు ఢీకొన్న ఘటనలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి హర్షవర్ధన్ సింగ్ (13) మృతి చెందాడు. సోమవారం సాయంత్రం 3:30 గంటలకు పీఎం పాలెం ఆఖరి బస్టాప్ నుంచి బక్కన్నపాలెం వెళ్లే రోడ్డు సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పీఎం పాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బక్కన్నపాలెంలో నివసించే ప్రమోద్ సింగ్ కుమారుడైన హర్షవర్ధన్.. నగరంలోని సెయింట్ ఆన్స్ ప్యారిస్ స్కూల్లో చదువుతున్నాడు. తన తండ్రి కారుషెడ్ కూడలి వద్ద నిర్వహిస్తున్న ప్లాస్టిక్ గృహోపకరణాల షాపు నిర్వహిస్తున్నాడు. సోమవారం సాయంత్రం హర్షవర్ధన్ షాపునకు వెళ్లి తిరిగి సైకిల్‌పై ఇంటికి బయలుదేరాడు. బక్కన్నపాలెం రోడ్డులో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న శ్రీ ప్రకాష్ స్కూల్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సైకిల్ పై నుంచి కిందపడిన విద్యార్థి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ రాము సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.