
స్వీకరణే..పరిష్కారం శూన్యం
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో పలు కీలక సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు, మాస్టర్ ప్లాన్ రోడ్లలో లైట్లు లేని ప్రాంతాల ప్రజలు, బరీయల్ గ్రౌండ్ సమస్యపై ఆ ప్రాంత వాసులు, జీతాలు పెంచాలని కోరుతున్న లైఫ్‌గార్డ్‌లు, వార్డుల వారీగా మౌలిక సదుపాయాల సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. సమస్యల పరిష్కారంలో జాప్యంపై ఫిర్యాదుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం జీవీంఎసీ పీజీఆర్‌ఎస్‌కు 118 వినతులు అందాయి.
● టిడ్కో ఇళ్లు: రూ. 3.20 లక్షలు కట్టినా ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదని 6వ వార్డుకు చెందిన షేక్ సుభాన్ ఆవేదన చెందారు.
● వీధి దీపాలు: పదేళ్లుగా మాస్టర్ ప్లాన్ రోడ్లపై వీధి దీపాలు లేవని, అధికారులు హామీ ఇచ్చినా అమలు కాలేదని 6వ వార్డు ప్రజలు మొరపెట్టుకున్నారు.
● బరియల్ గ్రౌండ్: మధురవాడలో బరియల్ గ్రౌండ్ నిర్మాణానికి నిధులు మంజూరై, టెండర్లు కూడా పూర్తయినా రెవెన్యూ సిబ్బంది లోపం వల్ల పనులు జరగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
● లైఫ్‌గార్డ్‌ల వేతనాలు: భీమిలి బీచ్ నుంచి అప్పికొండ బీచ్ వరకు లైఫ్‌గార్డ్స్‌గా 46 మంది విధులు నిర్వహిస్తున్నాం. బీచ్‌కు వచ్చే పర్యాటకుల ప్రాణాలకు రక్షణగా తీరం వెంబడి ఉంటున్నాం. వారి ప్రాణాలు ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉన్నాం. ఇంతగా శ్రమిస్తున్నా జీతాలు సక్రమంగా రావడం లేదు. మా వేతనాల్లో ఈఎస్‌ఐ, పీఎఫ్ కట్ అయిన అమౌంట్ ప్రతినెలా సరిగ్గా కట్ కావడం లేదు. రూ.18వేలతో కుటుంబంతో బతకడానికి అనేక ఇబ్బందులు పడతున్నాం. జీతాలు పెంచి మమ్మల్ని ఆదుకోవాలి.
మౌలికసదుపాయాలు కల్పించాలి: 28వ వార్డులో సీసీ డ్రెయిన్లు, రోడ్లు, కల్వర్టు మరమ్మతులు చేపట్టాలని వైఎస్సార్‌ీసీపీ జిల్లా అధికార ప్రతినిధి పల్లా దుర్గారావు వినతి పత్రం ఇచ్చారు. 22వ వార్డులో రోడ్లు తవ్వేసి వదిలేయడం, అంగన్వాడీల నిర్మాణం పూర్తి కాకపోవడం, డ్రైయినేజీ సమస్యలు, వీధి దీపాలు వెలగకపోవడం వంటి సమస్యలను ప్రజలు ప్రస్తావించారు.
అధికారులు సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని, కేవలం ఫిర్యాదులు స్వీకరించడం తప్ప పరిష్కారం చూపడం లేదని పలువురు ఫిర్యాదుదారులు ఆరోపించారు.
118 వినతులు
జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 118 వినతులు అందాయి. మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌తో కలిసి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్‌ఎస్ వర్మ, ప్రధాన ఇంజినీర్ పల్లంరాజు, ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు.
జీవీఎంసీ పీజీఆర్‌ఎస్‌పై ప్రజల పెదవి విరుపు