
మాస్టర్ ప్లాన్ రోడ్డు మూసివేతపై ఆందోళన
● జెడ్సీ చాంబర్ ముందు బైఠాయింపు ● పరిశీలించిన అధికారులు ● అడ్డంకి తొలగించిన కాలనీ మహిళలు
మధురవాడ: కొమ్మాది జవహర్ నవోదయ వద్ద మాస్టర్ ప్లాన్ రోడ్డును కొందరు వ్యక్తులు మూసివేయడంపై జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కొమ్మాది 1, కొమ్మాది 2 తదితర కాలనీల ప్రజలు సోమవారం మధురవాడ జోన్–2 కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ‘రోడ్డును వెంటనే తెరిపించాలి’, ‘జోనల్ కమిషనర్ డౌన్ డౌన్’ అంటూ సీఐటీయూ ఇతర ప్రజా సంఘాల నేతలు నినాదాలు చేశారు. సుమారు మూడు గంటలపాటు అక్కడే బైఠాయించి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. సమాచారం అందుకున్న పీఎంపాలెం ఎస్‌ఐ భాస్కరరావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అధికారులతో చర్చలు జరిపించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు డి.అప్పలరాజు మాట్లాడుతూ సమస్య పరిష్కరిస్తామని అధికారులు ఏడాది క్రితం చెప్పినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు. వేలాది మంది ప్రజలు ఈ రోడ్డు ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారని, దీనిని మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కోర్టు కేసులు ఉన్నాయని కొందరు వ్యక్తులు తరచుగా రోడ్డును మూసేస్తున్నారని, దీంతో బస్సు, ఆటోలు సహా ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయని చెప్పారు. ఒక న్యాయవాది తరచుగా దౌర్జన్యానికి దిగుతున్నారని, మహిళలపై చేయి చేసుకోవడం వంటి కారణాలతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మధురవాడ దళిత సంఘాల అధ్యక్షుడు సియాద్రి కనకరాజు మాట్లాడుతూ ఈ వ్యవహారంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. పైగా ప్రభుత్వ భూమికి టీడీఆర్ ఎలా డిమాండ్ చేస్తారని ప్రశ్నించారు. అనంతరం, పీఎంపాలెం పోలీసులు, అధికారులు మూసివేసిన రోడ్డును సందర్శించారు. ఈ సందర్భంగా రోడ్డు మూసివేసిన వ్యక్తితో మహిళలు వాగ్వివాదానికి దిగి, అడ్డుగా ఉన్న వాటిని తొలగించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అవతార్ సింగ్, కె. చిన్ని, వాసంతి, ఎండీ హుస్సేన్ బాబా, ఫాల్గుణ, చంద్రకళ రాము తదితరులు పాల్గొన్నారు.