సంక్షేమం లేదు గానీ.. మద్యం దుకాణాలా?
జగదాంబ: ప్రశాంతంగా ఉండే తమ నివాస ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడానికి వీల్లేదంటూ జీవీఎంసీ 39వ వార్డు మహిళలు ముక్తకంఠంతో నినదించారు. ఆదివారం ఉదయం దుకాణం ఏర్పాటుకు ప్రయత్నించిన వారిని స్థానిక మహిళలు, నేతలు అడ్డుకుని వెనక్కి పంపారు. కూటమి ప్రభుత్వం గతంలో నిర్వహించిన మద్యం దుకాణాల వేలంలో ఓ వ్యక్తి లైసెన్సు దక్కించుకున్నారు. మొదటగా జీవీఎంసీ 37వ వార్డు జబ్బర్‌తోటలో, ఆ తర్వాత 34వ వార్డు కొబ్బరితోటలో దుకాణం తెరిచేందుకు ప్రయత్నించగా అక్కడి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో 39వ వార్డు పరిధి వాడవీధిలో దుకాణం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు యజమాని మద్యం సరకుతో కూడిన వాహనంతో వాడవీధికి చేరుకున్నారు. ఈ ప్రాంతం జనవాసాలు, ఆసుపత్రి, దేవాలయం ఉన్న ప్రశాంతమైన ప్రదేశం కావడంతో, విషయం తెలుసుకున్న మహిళలంతా ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. తమ నివాసాల మధ్య మద్యం దుకాణం పెట్టడానికి ససేమిరా ఒప్పుకోమని తేల్చిచెప్పారు. యజమాని పట్టుబట్టడంతో కొందరు మహిళలు కర్రలతో ముందుకు వచ్చి మద్యం సీసాలను పగలగొడతామని హెచ్చరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, యజమాని చేసేదేమీ లేక మద్యం సరకుతో సహా వెనుదిరిగారు. ఈ సందర్భంగా మహిళలు ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం.. ప్రజల జీవితాలను నాశనం చేసే మద్యం దుకాణాలను మా వీధుల్లోకి పంపుతారా?’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీలకతీతంగా ఏకమైన స్థానికులు
ఈ నిరసనలో రాజకీయాలకు అతీతంగా స్థానిక నేతలు పాల్గొనడం విశేషం. వైఎస్సార్‌సీపీ వార్డు అధ్యక్షుడు ముజిబ్ ఖాన్, జనసేన నాయకురాలు కొల్లి సింహాచలం మహిళలకు మద్దతుగా నిలిచి, దుకాణం ఏర్పాటును అడ్డుకున్నారు. ‘ప్రభుత్వ నిబంధనలను విస్మరించి గుడులు, బడులు, ఆసుపత్రులు, నివాస గృహాల మధ్య మద్యం దుకాణాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు?’ అని వారు ప్రశ్నించారు. అనంతరం స్థానికులతో కలిసి అక్కడే బైఠాయించి, తమ ప్రాంతంలో మద్యం దుకాణం వద్దంటూ నినాదాలు చేశారు.
నివాసాల మధ్య వైన్ షాపు వద్దు
అడ్డుకున్న 39వ వార్డు మహిళలు


