పట్టాభిషేకంపై గుర్రు
అతడిని మార్చాల్సిందే..!
● టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పట్టాభి నియామకంపై విమర్శలు
● వెంటనే మార్చాలంటూ చంద్రబాబుకు ఫిర్యాదులు
● సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టారంటూ ఆగ్రహం
● తమను సంప్రదించకుండా నియమించడంపై ఎమ్మెల్యేలు కిన్ను
● సహకరించే ప్రసక్తే లేదని బీసీ నేతల అల్టిమేటం
సాక్షి, విశాఖపట్నం :
తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా చోడె పట్టాభిరామ్ నియామకం పార్టీలో చిచ్చు రేపుతోంది. ఏం అర్హత ఉందని పట్టాభికి అధ్యక్ష పదవి కట్టబెట్టారంటూ సీనియర్లు మండిపడుతున్నారు. బీసీలే పార్టీకి వెన్నెముక.. వారికే పార్టీలో పెద్దపీట వేస్తామంటూ ప్రతిసారి చెప్పే చంద్రబాబు, లోకేష్.. తమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికే బాధ్యతలు అప్పగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత సామాజికవర్గానికే తప్ప.. టీడీపీలో అణగారిన వర్గాలకు పదవులివ్వరా అంటూ క్యాడర్‌లోనూ అసహనం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు చంద్రబాబుకు ఈ నియామకంపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పట్టాభి నియామకాన్ని మార్చకపోతే.. సహకరించే ప్రసక్తే లేదంటూ బీసీ నేతలు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
క్యాడర్‌లోనూ అసహనం
కీలకమైన టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్ష పదవి నుంచి బీసీ నేత గండి బాబ్జీని తప్పించి.. తమ సామాజికవర్గానికి చెందిన చోడే పట్టాభిరామ్‌కు బాధ్యతలు అప్పగించడంపై బీసీ నేతలంతా ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. పట్టాభిని మించి.. పార్టీకి సేవలందించిన వారు ఎంతో మంది ఉన్నా.. కేవలం సొంత సామాజికవర్గం అనే కారణంతో పదవిని కట్టబెట్టడం సరికాదంటున్నారు. గతంలో పార్టీ నగర కార్యదర్శిగా వ్యవహరించినా.. పట్టాభికి పార్టీని నడిపే అనుభవం లేదనీ.. అలాంటి వ్యక్తికి బాధ్యతలు ఇవ్వడం ఏవిధంగా సముచితమో పార్టీ అధిష్టానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
అప్పట్లో పోటీకి వెనక్కి?
2023లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ తొలుత పట్టాభిరామ్ పేరుని ప్రతిపాదించారు. ఓడిపోయే ఎన్నికల్లో డబ్బులు పెట్టి పోటీ చేయనంటూ అధిష్టానం ఆదేశాల్ని తిరస్కరించినట్లు తెలుస్తోంది. 2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా ఉంటూ కార్పొరేటర్‌గా పోటీచేయాలని చెప్పినా.. పట్టించుకోలేదు. దీంతో పట్టాభిరామ్‌పై జిల్లా సీనియర్ నాయకులకు సదాభిప్రాయం లేకుండా పోయింది. అయినా అలాంటి వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే చంద్రబాబుకి దీనిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పట్టాభిరామ్ నియామకంపై పెదవి విరుస్తున్నారు. తమను సంప్రదించకుండానే జిల్లా అధ్యక్షుడిని నియమించడమేంటని సన్నిహితుల వద్ద వాపోయారని సమాచారం. ఇలా ఎవరికీ తెలియకుండా.. కేడర్ అభిప్రాయాన్ని సేకరించకుండా.. పట్టాభిరామ్‌కు పట్టం కట్టడంపై జిల్లా పార్టీలో చిచ్చురేపుతోంది. వార్డు అధ్యక్షుల నియామకానికి పార్టీ ఐవీఆర్‌ఎస్ ద్వారా అభిప్రాయాల్ని సేకరిస్తున్న అధిష్టానం.. జిల్లా అధ్యక్షుడి నియామకం విషయంలో ఎందుకు గోప్యతని ప్రదర్శించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఎమ్మెల్యేల అభిప్రాయాల్ని కూడా అడగకపోవడం శోచనీయమంటున్నారు. కేవలం సామాజికవర్గాన్ని దృష్టిలోపెట్టుకొని పట్టాభిరామ్‌కు బాధ్యతలు అప్పగించడం పూర్తిగా తప్పుడు నిర్ణయమనీ.. వెంటనే నియామకాన్ని రద్దు చేసి.. బీసీ అభ్యర్థికి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టాలన్న డిమాండ్ పార్టీలో మొదలైంది. దీనిపై అధిష్టానం స్పందించకపోతే జిల్లా అధ్యక్షుడికి సహకరించేది లేదని క్యాడర్ అల్టిమేటం జారీ చేయడంతో పచ్చపార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.


