
చెరువు కాదు.. ఏయూ మైదానం
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల క్రీడా మైదానం చెరువును తలపిస్తోంది. మంగళవారం రాత్రి నగరంలో కురిసిన వర్షానికి ఏయూ గ్రౌండ్‌లో భారీగా నీరు చేరింది. దీంతో బుధవారం క్రీడాకారులు అటువైపు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఒక్కో చోట మోకాళ్ల లోతు వర్షపు నీరు నిల్వ ఉండిపోగా.. మైదానం మొత్తం చిత్తడిగా తయారైంది. ఈ మైదానాన్ని ఇటీవలే అభివృద్ధి చేశారు. ఇక్కడే ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ నిర్వహించారు. ఇందుకోసం గ్రౌండ్ మొత్తాన్ని ఇష్టానుసారంగా తవ్వేశారు. గ్రౌండ్‌కు ఆనుకుని ఉన్న కాలువలను సైతం మట్టితో కప్పేశారు. వర్షపు నీరు బయటకు పోయేందుకు మార్గం లేకపోవడంతోనే ఇప్పుడు మైదానం మధ్యలోనే నీరు నిలిచిపోయింది. చిన్నపాటి వర్షానికే మైదానం ఇలా తయారైతే.. భారీగా వర్షం కురిస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని క్రీడాకారులు, ఆచార్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు మళ్లీ చోటు చేసుకోకుండా.. వర్సిటీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.