చందనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

చందనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

Mar 20 2025 1:22 AM | Updated on Mar 20 2025 1:16 AM

మహారాణిపేట : సింహగిరిపై ఏప్రిల్‌ 30వ తేదీన జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వివిధ విభాగాల అధికారులను కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌ ఆదేశించారు. ఆ రోజు తెల్లవారుజాము 3.30 నుంచి 4.30 గంటల వరకు మాత్రమే అనువంశిక ధర్మకర్త, తితిదే నుంచి పట్టువస్త్రాలు సమర్పించేవారికి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు, దాతలకు అంతరాలయ దర్శనాలు ఉంటాయని పేర్కొన్నారు. 29వ తేదీ రాత్రి 6 గంటల నుంచి సాధారణ దర్శనాలు నిలిపివేస్తామని తెలిపారు. పోలీస్‌ కమిషనర్‌ శంకబ్రత బాగ్చి, ఇతర ఏడీసీపీలు, దేవదాయ శాఖ అధికారులు, ఈవో కె.సుబ్బారావు, డీఆర్వో బి.హెచ్‌.భవానీశంకర్‌, భీమిలి ఆర్డీవో సంగీత్‌ మాధుర్‌, ఇతర అధికారులతో కలిసి కలెక్టరేట్‌లో చందనోత్సవం ఏర్పాట్లపై సమీక్షా సమావేశం బుధవారం నిర్వహించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించి చందనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. నగర పరిధిలోని అనుకూల ప్రాంతాల్లో టికెట్ల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి.. రూ.1500, రూ.1,000, రూ.300 టికెట్ల జారీ ప్రక్రియను ప్రణాళికాయుతంగా చేపట్టాలన్నారు. రూ.1,500 టికెట్లు కొనుగోలు చేసిన వారికి మాత్రమే నీలాద్రి గుమ్మం వద్ద నుంచి దర్శనానికి అనుమతిస్తారని స్పష్టం చేశారు. హనుమంతవాక వైపు నుంచి పాత గోశాల వరకు, అక్కడ నుంచి అడవివరం వరకు రెండు పార్కింగ్‌ జోన్లు ఏర్పాటు చేయాలని.. అవసరం మేరకు హనుమంతవాక వైపు, అడవివరం వైపు వీలైనన్ని పార్కింగ్‌ స్థలాలను గుర్తించాలని సూచించారు. తగినన్ని బస్సులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విరివిగా తాగునీటి కేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు, వైద్య శిబిరాలను పెట్టాలన్నారు. మరుగుదొడ్లు ఇతర వసతులు సమకూర్చాలని చెప్పారు. పరిమిత సంఖ్యలో వెహికల్‌ పాస్లు జారీ చేయాలని చెప్పారు. ప్రైవేటు వాహనాలను కొండపైకి అనుమతించరాదని స్పష్టం చేశారు.

అదనపు పార్కింగ్‌ ప్రదేశం,

పోలీస్‌ ఔట్‌ పోస్టుపై సూచన

సింహాచలం కొండపై అదనపు పార్కింగ్‌ ప్రదేశాన్ని అభివృద్ధి చేయడంతోపాటు శాశ్వత పోలీస్‌ ఔట్‌ పోస్టును ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేయగా సంబంధిత చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి అనుసంధానం చేస్తూ.. సెంట్రలైజ్డ్‌ పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం పెట్టాలని, కొండ, మెట్ల మార్గంలో విరివిగా మైక్‌ హారన్లు పెట్టాలని సూచించారు. పోలీస్‌ కమిషనర్‌ బాగ్చి ట్రాఫిక్‌ నియంత్రణ, పార్కింగ్‌ ప్రదేశాల గుర్తింపు, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాలపై సూచనలు చేశారు. సమావేశంలో దేవదాయ, పోలీసు, జీవీఎంసీ, విద్యుత్‌, వైద్య, రవాణా, ఆర్టీసీ, రెవెన్యూ తదితర విభాగాల ఉన్నతాధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement