ప్రతిష్టాత్మకంగా ‘ఆడుదాం ఆంధ్ర’ | Sakshi
Sakshi News home page

ప్రతిష్టాత్మకంగా ‘ఆడుదాం ఆంధ్ర’

Published Tue, Nov 28 2023 12:58 AM

లోగో విడుదల చేస్తున్న కలెక్టర్‌ మల్లికార్జున - Sakshi

● లోగో ఆవిష్కరించిన కలెక్టర్‌ మల్లికార్జున ● ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల ప్రారంభం

విశాఖ స్పోర్ట్స్‌ : ప్రతిష్టాత్మకంగా గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నిర్వహించనున్న ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్‌ (ఏఏటీ) లోగోను సోమవారం కలెక్టర్‌ ఎ.మల్లికార్జున విడుదల చేశారు. డిసెంబర్‌ 15వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు 51 రోజులపాటు పోటీలు నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు విశాఖ వేదిక కానుంది. పోటీల్లో పాల్గొనే ఆటగాళ్లు ఆన్‌లైన్‌ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలి. సోమవారం నిర్వహించిన సమావేశంలో జేసీ విశ్వనాథన్‌, సెట్విస్‌ సీఈవో కీర్తి, డీఎస్‌ఏ చీఫ్‌ కోచ్‌ గాలియట్‌, ఏసీపీ బాపూజీ, జిల్లా రెవెన్యూ అధికారి కే.మోహన్‌కుమార్‌, జీవీఎంసీ అదనపు కమిషనర్‌ వర్మ, పూర్ణిమదేవి పాల్గొన్నారు.

ఐదు క్రీడాంశాల్లో..

ఆడుదాం ఆంధ్రలో ఐదు క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. క్రికెట్‌, బాడ్మింటన్‌, వాలీబాల్‌, కబడ్డీతో పాటు ఖోఖో పోటీలు నిర్వహించనున్నారు. నగదు పారితోషికాలతో జట్లను ప్రోత్సహించనున్నారు.

పేర్లు నమోదు చేసుకోండి

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆడుదాం ఆంధ్ర టోర్నీ నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈవెంట్‌ నిర్వహిస్తుంది. ఐదు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నాం. గ్రామ, వార్డు స్థాయిలో పదిమంది స్పోర్ట్స్‌ వలంటీర్లను ఎంపిక చేసి శిక్షణ నిచ్చాం. aadudamandhra.ap. gov.inలో లాగిన్‌ అయి పేర్లను నమోదు చేసుకోవచ్చు. 1902 నంబర్‌కు కాల్‌ చేసికూడా నమోదు చేసుకోవచ్చు.

– మల్లికార్జున, జిల్లా కలెక్టర్‌, డీఎస్‌ఏ చైర్మన్‌

 
Advertisement
 
Advertisement