ఆంధ్ర యూనివర్సిటీలో డ్రోన్‌ ట్రైనింగ్ .. రండి.. సంపాదించుకోండి

డ్రోన్‌ పనితీరును పరిశీలిస్తున్న ఏయూ వీసీ ప్రసాదరెడ్డి (ఫైల్‌) - Sakshi

రండి.. డ్రోన్‌ టెక్నాలజీలో శిక్షణ పొందుదాం

ఇంజినీరింగ్‌, డిగ్రీ విద్యార్థులకు ఏయూ ఆహ్వానం

శిక్షణ, నిర్వహణ, తయారీపై వర్సిటీలో కేంద్రం

సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుత రోజుల్లో సందడంతా డ్రోన్లదే. వ్యవసాయం, పెళ్లిళ్లు, భూముల సర్వే, మందుల పంపిణీ, సినిమా షూటింగ్‌లు, యూట్యూబ్‌ వీడియోలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఏరియల్‌ సర్వే.. ఇలా పలు సందర్భాల్లో డ్రోన్ల వినియోగం గణనీయంగా పెరిగింది.

సాంకేతికతో సాయంతో వీటికి దిశానిర్దేశం చేస్తే.. లక్ష్యాన్ని అందుకుంటాయి. అయితే వీటిని నడిపే మానవ వనరుల కొరత ఉంది. నిర్వహణ సామర్థ్యాలు పెంచుకోవడం, ఖర్చును తగ్గించుకునే విషయంలో ఇప్పుడు అందరి ఆలోచన డ్రోన్‌ టెక్నాలజీ.. ప్రస్తుతం డ్రోన్ల సేవలు విస్తరిస్తున్న తరుణంలో విద్యార్థులను డ్రోన్‌ టెక్నాలజీలో సుశిక్షుతులను చేసేందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం సన్నద్ధమైంది. ఇందులో పరిశోధనల కోసం డ్రోన్‌ టెక్నాలజీ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం 2022లో డ్రోన్‌ అంకుర సంస్థల వృద్ధి 34.4 శాతంగా నమోదైంది. డ్రోన్‌ టెక్నాలజీ సంస్థల్లో పెట్టుబడులూ వెల్లువెత్తుతున్నాయి. డ్రోన్‌ సేవల మార్కెట్‌ విలువ దేశీయంగా రెండేళ్ల కిందట 13.04 కోట్ల డాలర్లుగా నమోదైంది. 2030 నాటికి ఇది 400 కోట్ల డాలర్లకు పురోగమిస్తుందని నిపుణులు అంచనా.

వివిధ రంగాలకు అవసరమైన డ్రోన్లు, వాటి విడిభాగాలను తయారు చేసుకోవడంలో భారత్‌.. ఇంకా స్వయం సమృద్ధి సాధించలేదు. సరైన ప్రణాళికలు, ప్రోత్సాహం అందిస్తే స్టార్టప్‌ సంస్థల సహకారంతో దేశంలో తయారీ సామర్థ్యం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు డ్రోన్‌ టెక్నాలజీని అందిపుచ్చుకునేలా సరికొత్తగా ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఆఫ్‌ డ్రోన్‌ టెక్నాలజీస్‌(ఐసీడీటీ) కేంద్రాన్ని ఏయూ ఏర్పాటు చేసింది.

యూనివర్సిటీల చరిత్రలో తొలిసారిగా..

డ్రోన్‌ టెక్నాలజీ పరిశోధలనలపై ఈ తరహా కేంద్రాన్ని ఇంత వరకూ ఏ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయలేదు. మొదటిసారిగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏయూ ప్రాంగణంలోని హెలిప్యాడ్‌ గ్రౌండ్స్‌ను ఆనుకొని దీన్ని ప్రారంభించారు. డ్రోన్లకు సంబంధించిన పైలట్‌, అప్‌స్కిల్లింగ్‌, ట్రైనింగ్‌, అసెంబుల్‌, నూతన సాంకేతికత మొదలైన అన్ని అంశాల్లోనూ ఇక్కడ పరిశోధనలు జరగనున్నాయి.

డ్రోన్ల నిర్వహణ, తయారీ అంశాలపై పరిశోధనలు చేసే కేంద్రంగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. ఏయూలో ఏ కోర్సు చదివే విద్యార్థులైనా ఇక్కడ అందించే కోర్సుల్లో చేరి తమ నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశం కల్పిస్తోంది. విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కల్పించడానికి హెలీపాడ్‌ మైదానాన్ని వినియోగించనున్నారు. ఈ సెంటర్‌లో డ్రోన్‌ వినియోగం, డ్రోన్‌ టెక్నాలజీపై భవిష్యత్‌ పరిశోధనలు నిర్వహించేలా మరింత అభివృద్ధి చేసేందుకు ఏయూ ప్రణాళికలు సిద్ధం చేసింది.

సర్టిఫికెట్‌ ప్రోగ్రాంగా అందిస్తున్నాం

దేశాన్ని డ్రోన్ల కేంద్రంగా మార్చాలని కేంద్రం, వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగం విస్తృతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నాయి. అయితే వేగంగా విస్తరిస్తున్న భారతీయ డ్రోన్‌ పరిశ్రమకు నిపుణులైన మానవ వనరుల కొరత వేధిస్తోంది. దీన్ని అధిగమించేలా తొలిసారిగా డ్రోన్‌ టెక్నాలజీ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ఏయూలో ప్రారంభించాం. ఐసీడీటీను పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు విద్యార్థులకు సర్టిఫికెట్‌ ప్రోగ్రాం కూడా అందిస్తున్నాం. ఇంజినీరింగ్‌ విద్యార్థులతో పాటు ఏయూ పరిధిలోని డిగ్రీ విద్యార్థులు కూడా ఈ శిక్షణలో చేరేందుకు అవకాశం కల్పిస్తున్నాం.

– ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి, వీసీ, ఏయూ

Read latest Visakhapatnam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top