విశాఖ: హలీం.. రుచికి సలాం

నగరంలోని ఓ హలీం సెంటర్‌లో వడ్డన చేస్తున్న సిబ్బంది - Sakshi

రంజాన్‌ ప్రత్యేక వంటకంగా హలీం గుర్తింపు

విశాఖలో భారీగా పెరిగిన ఆదరణ

పలు వీధుల్లో వెలుస్తున్న హలీం సెంటర్లు

రంజాన్‌ మాసం ప్రారంభమైందంటే చాలు ముస్లింలకు ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలే కాదు.. అనేక పోషక విలువలున్న హలీం గుర్తుకొస్తుంది. మాంసంతో పాటు అనేక రకాల ఆహార పదార్థాలను మిళితం చేసి గంటల కొద్దీ ఉడకబెట్టి తయారు చేసే హలీంకు ఎంతో ప్రత్యేకత ఉంది. కొన్నేళ్లుగా విశాఖలో హాలీం వంటకాన్ని ప్రజలకు అందిస్తున్నారు. నెల రోజుల పాటు నగరంలోని జగదాంబ, జ్యోతి థియేటర్‌ జంక్షన్‌, అక్కయ్యపాలెం, రేసపువానిపాలెం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున స్టాళ్లు ఏర్పాటు చేసి అమ్మకాలు చేపడుతున్నారు. దీంతో పాటు మసీదుల వద్ద కూడా హలీమ్‌ విక్రయిస్తున్నారు.

ఉపవాస దీక్షలు జరిగే నెలరోజులు పాటు ముస్లింలే కాకుండా సాధారణ జనాలు సైతం ఈ రుచికి సలాం అంటున్నారు. ఒకప్పుడు కేవలం హైదరాబాద్‌కే పరిమితమైన ఈ వంటకం తర్వాత అన్ని ప్రాంతాలకు విస్తరించింది. మన విశాఖలో జగదాంబ సెంటర్‌, లీలామహల్‌ జంక్షన్‌తో పాటు పలు ప్రాంతాల్లో హలీం సెంటర్లు వెలిశాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ రుచులను విశాఖ వాసులకు చూపించేందుకు అక్కడ నుంచి హలీం తయారు చేసే నిపుణులను ఇక్కడకు తీసుకొచ్చారు.

ముస్లింలు పవిత్ర రంజాన్‌ మాసంలో తెల్లవారుజాము 4 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు సుమారు 14 గంటలకు పైగా ఉపవాస దీక్షలో ఉంటారు. ఆ సమయంలో ఆహారంతో పాటు ఎటువంటి ద్రవ పదార్థాలు తీసుకోరు. ఉపవాస దీక్ష ముగించే సరికి శరీరానికి తగిన శక్తి అవసరమవుతుంది. సాధారణంగా డ్రై ఫ్రూట్స్‌తో ఉపావాస దీక్ష విరమించిన ఆ తర్వాత తీసుకునే ఆహారంలో హలీంకు ప్రాధాన్యమిస్తారు.

హలీంలో మంచి పోషక విలువలతో పాటు తేలికగా జీర్ణమయ్యే గుణం ఉండడమే ఇందుకు కారణం. కేవలం సాయంత్రం లభించే హలీం రుచులను ఆస్వాదించడానికి నగర ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ముస్లింలే కాకుండా మిగిలిన వారు కూడా ఈ రుచికి సలాం అంటున్నారు. హలీం పుట్టింది అరబ్‌ దేశాల్లో అయినా ప్రాచూర్యం పొందింది మాత్రం హైదారాబాద్‌లోనే అని చెప్పుకొవచ్చు. అలాంటి ఈ వంటకం నేడు అన్ని ప్రాంతాలకు విస్తరించింది.

తయారీ ప్రత్యేకమే..

సంప్రదాయక వంటలతో పోలిస్తే హలీం తయారీ ఆద్యంతం ప్రత్యేకమే. దీనికి కనీసం 8 గంటల సమయం పడుతుంది. ఇందులో మటన్‌ లేదా చికెన్‌, గోధుమలు, అన్ని పప్పులు, బాస్మతి బియ్యం, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, ఉల్లి, పచ్చిమిర్చి, యాలకులు, దాల్చినచెక్క, మిరియాలు తదితర 18 రకాల మసాలా దినుసులు, కొత్తిమీర, పొదీనా ఆకులు, నూనె, బాదం, పిస్తా, జీడిపప్పు తదితర డ్రైఫ్రూట్స్‌, ఎండు గులాబీ రేకులు, జాఫ్రాన్‌, సొంపు, పాలు తదితర వాటిని వినియోగిస్తారు.

ముందుగా గిన్నెలో మాంసం, నీటిని కలిపి బాగా ఉడికిస్తారు. తగిన నెయ్యి, డాల్డా తీసుకుని గరమసాలన్నీ వేయించాక.. కడిగిన గోధుమ రవ్వను సమపాళ్లలో నీరు, పాలు వేసి కలుపుతారు. ఆ మిశ్రమాన్ని ఒకే ఉష్ణోగ్రతలో ఉడికిస్తారు. అప్పటికే ఉడికిన మాసం వేసి మిశ్రమాన్ని పెద్ద తెడ్డులాంటి కర్రతో రుబ్బుతూనే ఉంటారు. ఇలా ఉదయం ఎనిమిది గంటలకు మొదలు పెడితే.. సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ప్రక్రియ సాగుతుంది.

ఆ మిశ్రమం అంతా ముద్దగా తయారై హాలీంగా మారుతుంది. చికెన్‌తో అయితే మిశ్రమం తయారీకి సమయం తక్కువగా ఉంటుంది. మటన్‌తో అయితే సమయం ఎక్కుగా తీసుకుంటుంది. చికెన్‌ హలీంను హరీస్‌గా పిలుస్తారు. హలీం రుచికే కాదు. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులోని పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. ఒక కప్పు హలీంలో 365 క్యాలరీలు, కొవ్వు నుంచి లభించే క్యాలరీలు 150 లభిస్తాయి.

కద్దూ–ఖా–ఖీర్‌

కద్దూ–కా– ఖీర్‌ హలీం తర్వాత స్వీకరించే అత్యంత రుచికరమైన స్వీట్‌. ఆనపకాయ, సెమీయా, సగ్గు బియ్యం, పంచదారతో ఈ తియ్యని పదార్థాన్ని (పాయసం) తయారు చేస్తారు. ఉపవాస దీక్ష ఆచరించిన వారికి శరీరంలో పెరిగిన ఉష్ణోగ్రతను తగ్గించేందుకు ఈ పాయసం ఎంతో ఉపయోగపడుతుంది. కూలింగ్‌లో పెట్టుకుని.. హలీం తర్వాత ఈ స్వీట్‌ తింటే మధురానుభూతి పొందుతారు.

Read latest Visakhapatnam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top