● నేటి నుంచి మాసోత్సవాలు
● దోమల నిర్మూలన,
పారిశుద్ధ్యంపై ప్రత్యేక ఫోకస్
శుభ్రతతోనే దోమలకు చెక్
నేటి నుంచి జిల్లాలో మలేరియా మాసోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలను చైతన్యం చేస్తాం. ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలి.
– డాక్టర్.రవీంద్రయాదవ్,
డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ
తాండూరు: మలేరియా నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో దోమలు వ్యాపించే అవకాశం ఉంది. దీంతో ఈ నెల 4నుంచి జూలై 4వ తేదీ వరకు మలేరియా మాసోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. దోమలను అంతం చేయండి.. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించండి అనే నినాదంతో వైద్యాధికారులు ముందుకు సాగనున్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రి, మాతాశిశు కేంద్రాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వైద్యులు, వైద్యాధికారులు సమన్వయంతో పని చేస్తుండటంతో కొన్నేళ్లుగా జిల్లాలో మలేరియా, చికెన్ గున్యా, బోధకాలు వంటి కేసులు తగ్గిపోయాయి. కానీ ఏటా డెంగీ కేసులు అధిక సంఖ్యలో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
● పనికిరాని పాత్రలు, టైర్లు, పగిలిపోయిన బకెట్లు, తొట్లు వంటి వాటిలో నీరు ఉంటే తొలగించాలి. వాటని ఇళ్ల పరిసరాల్లో లేకుండా చూసుకోవాలి.
● ఓవర్‌హెడ్ ట్యాంకులు, సంపులు, డ్రమ్ములు, నీటి తోట్ల వంటి వాటని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
● ఇంటిపై నీరు నిలవకుండా చూసుకోవాలి.
● ప్రతి శుక్రవారం డ్రైడే గా నిర్వహించాలి. ఉన్న నీటిని పారబోసి మళ్లీ నింపుకోవాలి.
● సెప్టిక్ ట్యాంకులకు నైలాన్ జాలిని కట్టుకోవాలి.
● ఇంటి కిటికీలు, గుమ్మాలకు జాలిని అమర్చాలి.
● నిద్రించే సమయంలో విధిగా దోమ తేరలు వినియోగించాలి.
పంచాయతీలు.. మున్సిపాలిటీల్లో..
● వీధులను పరిశుభ్రంగా ఉంచాలి.
● మురుగు కాలువలు, డ్రైనేజీలను క్లీన్ చేయాలి. చెత్తాచెదారం తొలగించాలి
● వర్షాలకు ముందే కాలువల్లో పూడికను తొలగించాలి. మురుగు పారేలా ఏర్పాట్లు చేయాలి
● గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, నాయకులు ప్రజలకు అవగాహన కల్పించాలి.
● వ్యాధులు ప్రబలిన వెంటనే ఆరోగ్య సిబ్బందికి సమాచారం ఇచ్చి వారి సూచనలు పాటించాలి.
2019 నుంచి నమోదైన డెంగీ కేసులు


