వికారాబాద్‌ ఆర్‌టీఓగా సుభాష్‌చంద్రారెడ్డి | - | Sakshi
Sakshi News home page

వికారాబాద్‌ ఆర్‌టీఓగా సుభాష్‌చంద్రారెడ్డి

Jun 3 2026 6:48 AM | Updated on Jun 3 2026 6:48 AM

వికారాబాద్‌ ఆర్‌టీఓగా సుభాష్‌చంద్రారెడ్డి స్టేట్‌ ఫైనాన్స్‌ కమిటీ సభ్యుడిగా రంగరాజు ఐదుగురు పంచాయతీ కార్యదర్శుల బదిలీ కాంగ్రెస్‌ తాండూరు ‘సర్‌’ కన్వీనర్‌గా పురుషోత్తంరావు లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలి

అనంతగిరి: వికారాబాద్‌ ఆర్‌టీఓగా సుభాష్‌చంద్రారెడ్డి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇబ్రహీంపట్నం ఆర్‌టీఓగా పనిచేసిన ఆయన బదిలీపై వచ్చారు. ఇక్కడ విధులు నిర్వహించిన వెంకట్‌రెడ్డి అసిఫాబాద్‌కు బదిలీ అయ్యారు.

అనంతగిరి: వికారాబాద్‌ పట్టణానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు కె.రంగరాజు తెలంగాణ స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో చైర్మన్‌తో పాటు ముగ్గురు సభ్యులున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన రంగరాజు ఎంఏ, బీఎడ్‌, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. కాగా ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో 16 ఏళ్లుగా పరిచయం ఉంది. తన నియామకానికి కృషి చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు, రాజ్యసభ ఎంపీ వేం నరేందర్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు.

దుద్యాల్‌: మండల పరిధిలో ఐదుగురు పంచాయతీ కార్యదర్శులు బదిలీ అయ్యారని ఎంపీడీఓ జైపాల్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలతో తెలిపారు. ఎక్కచెరువు తండా, ఆలేడ్‌, చెట్టుపల్లి తండా, అల్లిఖాన్‌పల్లి, హంసంపల్లి గ్రామ పంచాయతీలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు బదిలీ అయ్యారు. హంసంపల్లి పంచాయతీ కార్యదర్శి పుష్పలత స్థానంలో వెంకటేశ్‌, అల్లిఖాన్‌పల్లి పంచాయతీ కార్యదర్శి అరుణజ్యోతి స్థానంలో జె.సోని, ఆలేడ్‌ పంచాయతీ కార్యదర్శి రమేశ్‌ స్థానంలో నసీరుద్దీన్‌, చెట్టుపల్లి తండా పంచాయతీ కార్యదర్శి శ్రీవాణి స్థానంలో స్రవంతిని నియమించారు. ఎక్కచెరువు తండా పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్‌ స్థానంలో ఇంకా ఎవ్వరిని కేటాయించలేదని చెప్పారు. ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, అటెండర్‌ ఖలీమ్‌ సైతం బదిలీ అయ్యారు. వీరి స్థానాల్లోనూ ఎవరినీ కేటాయించలేదు.

తాండూరు: ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ(ఎస్‌ఐఆర్‌)లో భాగంగా కాంగ్రెస్‌ తాండూరు నియోజకవర్గ కన్వీనర్‌గా యాలాల మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తంరావును నియమించినట్లు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తాండూరు అసెంబ్లీ పరిఽధిలోని 269 పోలింగ్‌ బూత్‌లలో సర్‌ ప్రక్రియ సక్రమంగా నిర్వహించేందుకు సీనియర్‌ నాయకుడు, న్యాయవాది కరణం పురుషోత్తంరావును కన్వీనర్‌గా నియమించామని చెప్పారు. ఈ సందర్భంగా పురుషోత్తంరావు ఎమ్మెల్యేను కలిశారు.

ఆమనగల్లు: పట్టణంలోని కోర్టులో ఈనెల 13న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ అరుణ్‌కుమార్‌ అన్నారు. కోర్టు ఆవరణలో జాతీయ లోక్‌ అదాలత్‌పై మంగళవారం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరిష్కారానికి అనువైన కేసులను, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పిటీ కేసులు, ఇరుపక్షాలు సమన్వయం చేసుకుని పరిష్కరించే కేసులను గుర్తించి రాజీ పడేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐలు వెంకటేశ్వర్లు, జానకిరాంరెడ్డి, సైదిరెడ్డి, వేణుగోపాల్‌, ఏపీపీ కార్తీక్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement