నవాబుపేట: పాత కక్షలు మనసులో పెట్టుకుని ఇరువర్గాల వారు పరస్పరం దాడి చేసుకున్న ఘటనలో 15 మందిపై కేసులు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. వికారాబాద్ డీఎస్పీ అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మూలమాడకు చెందిన ఆలంపల్లి కిష్టయ్య కొంతకాలంగా పంచాయతీ వాటర్ మెన్‌గా పని చేస్తున్నాడు. ఈనేపథ్యంలో గ్రామానికి చెందిన బిల్లపాటి బాల్‌రాజ్, అతని అనుచరులు తమ ఇళ్లకు సరిపడా నీళ్లు రావడం లేదని సోమవారం రాత్రి 10 గంటలకు కిష్టయ్యను నిఽలదీశారు. ఈక్రమంలో మాటామాటా పెరిగి బాల్‌రాజ్ అనుచరులు కిష్టయ్యపై దాడి చేశారు. ఇది గమనించిన కిష్టయ్య కొడుకు లక్ష్మణ్, గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సుభాన్‌రెడ్డి (ఇతని కోడలు ప్రస్తుత సర్పంచ్)కి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆయన మరికొంత మందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే ఆవేశంలో ఉన్న బాల్‌రాజ్ అనుచరులు సుభాన్‌రెడ్డిపై సైతం దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న నవాబుపేట ఎస్‌ఐ గిరి తన సిబ్బందితో గ్రామానికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించి, ఎవరి ఇళ్లకు వారిని పంపించారు. తన తండ్రిపై దాడి చేశారని తెలుసుకున్న సుభాన్‌రెడ్డి కొడుకు నరేందర్‌రెడ్డి పలువురు అనుచరులతో మంగళవారం తెల్లవారుజామున నగరం నుంచి ఊరికి చేరుకున్నాడు. సుభాన్‌రెడ్డిపై దాడికి పాల్పడిన పలువురి ఇళ్లపై మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. ఈఘటనలో కొంతమందికి గాయాలవగా, మరికొంత మంది అప్పటికే ప్రాణభయంతో పారిపోయారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నరేందర్‌రెడ్డితో పాటు అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, సీఐ వెంకట్, ఎస్‌ఐ గిరి గ్రామానికి చేరుకుని, వివరాలు సేకరించారు. ఈ ఘటనలో బాల్‌రాజ్‌తో పాటు మరో ఐదుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేయగా, నరేందర్‌రెడ్డితో పాటు మరో ఎనిమిది మందిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి మొత్తం 15 మందిని రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
మూలమాడలో ఇరువర్గాల ఘర్షణ
ఆరుగురిపై హత్యాయత్నం, తొమ్మిది మందిపై అట్రాసిటీ కేసులు
15మందికి రిమాండ్
గ్రామంలో ఉద్రిక్త వాతావరణం, పోలీస్ పికెట్ ఏర్పాటు


