పిడుగుపాటుకు మేకల కాపరి మృతి | - | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు మేకల కాపరి మృతి

Apr 30 2026 9:36 AM | Updated on Apr 30 2026 9:36 AM

తాండూరు రూరల్‌: పిడుగుపాటుకు మేకల కాపరి మృతిచెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈఘటన పెద్దేముల్‌ మండలం కొండాపూర్‌లో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన కొడి ఆనందం(42), నీరటి నర్సింలు, ఏర్పుల జాని మేకలు మేపేందుకు పొలాలకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తున్న క్రమంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో గ్రామ సమీపంలోని ఓ చింత చెట్టుకింద జీవాలను తోలి అక్కడే నిల్చున్నారు. దీంతో ఒక్కసారిగా భారీ శబ్ధంతో పిడుగు పడడంతో వారు స్పృహతప్పి పడిపోయారు. వర్షం తగ్గాక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెళ్లి పరిశీలించి వారిని తాండూరులోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆనందం మృతి చెందినట్లు నిర్ధారించారు. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడికి భార్య అనసూజ, కూతురు, కొడుకు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరో ఇద్దరికి తీవ్రగాయాలు

Advertisement
 
Advertisement
Advertisement