బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆమనగల్లు: బీఆర్‌ఎస్ నాయకుల అనైక్యత వల్లే ఆమనగల్లు మున్సిపాలిటీ కోల్పోయామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆమనగల్లులో గెలిచి ఓడిపోయామని, దీనికి ఎవరినీ బాధ్యులను చేయనని తెలిపారు. నగరంలోని తెలంగాణ భవన్‌లో బుధవారం మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లికి చెందిన ఎన్‌ఆర్‌ఐ, తెలంగాణ బ్లాక్ వాయిస్ అధ్యక్షుడు గోవింద్ శ్రీధర్ బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీన్‌కుమార్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. కేటీఆర్ అతనికి కండువా వేసి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆమనగల్లు మున్సిపాలిటీలో 15 సీట్లకు గాను 8 బీఆర్‌ఎస్ గెలిచిందని, బీఆర్‌ఎస్‌కు మెజార్టీ సీట్లు వచ్చినా మున్సిపాలిటీ చేజారిందని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలు మెచ్చే విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని, రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రగతిపథంలో నిలిపారని గుర్తుచేశారు. భవిష్యత్తులో బీఆర్‌ఎస్ నాయకులు కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ద్యాప విజితారెడ్డి, జీఎల్‌ఎన్‌రెడ్డి, గంప వెంకటేశ్, నిర్మల శ్రీశైలంగౌడ్, శ్రీనివాస్‌యాదవ్, ఏమిరెడ్డి జైపాల్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, లాలయ్యగౌడ్, శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.


