రాజేంద్రనగర్: కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ గృహిణి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై ప్రశాంత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పల్లవి (20) శ్రీనివాస్ భార్యాభర్తలు. రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. గోల్డెన్ హెడ్స్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కొన్ని రోజులుగా పల్లవిని శ్రీనివాస్ పట్టించుకోవడం లేదు. మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నాడు. ఇదే విషయమై పల్లవి పలుమార్లు ప్రశ్నించింది. విషయాన్ని కుటుంబ పెద్దలకు సైతం చెప్పింది. దీంతో శ్రీనివాస్ ఆమెతో మాట్లాడటం మానేశాడు. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పల్లవి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


