అనంతగిరి: అనగారిన వర్గాల ఆశాజ్యోతి, అంటరాని వారి శ్రేయస్సుకు జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి బాబు జగ్జీవన్‌రామ్. ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. ఆదివారం బాబు జగ్జీవన్‌రామ్ జయంత్యుత్సవాల్లో పాల్గొన్న స్పీకర్ ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమర యోధులు, సంఘసంస్కర్త, దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ కేంద్రంలో వివిధ శాఖలకు మంత్రిగా, ఉప ప్రధానిగా సుదీర్ఘ కాలం దేశానికి సేవలందించారని గుర్తు చేశారు. 1935లో అంటరానితనం పారదోలేందుకు, ప్రజలందరికి సమానత్వం కోసం ఆలిండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ సంస్థ ఏర్పాటులో ఆయన ప్రముఖ పాత్ర పోషించారన్నారు. రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్‌తో కలిసి సామాజిక న్యాయం కోసం పని చేసి రాజ్యాంగ ఫలాలు దేశంలోని అట్టడుగు వర్గాలకు అందడంలో ఆయన కీలక భూమిక పోషించారన్నారు. 1971 యుద్ధ సమయంలో రక్షణ శాఖ మంత్రిగా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆదేశాలకు అనుగుణంగా సేనలను నడిపించి బంగ్లాదేశ్ ఏర్పాటులో ఆయన ప్రధానపాత్ర పోషించారన్నారు. హరిత విప్లవం విజయవంతం చేసేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిది అన్నారు. ఆయన ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలు, కులాల వారికి సమానంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఫలాలు అందిస్తుందన్నారు. అనంతరం కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ.. జ్ఞానాన్ని పెంపొందిచేందుకు వీలుగా స్టడీ సర్కిల్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు. ఎస్పీ స్నేహ మెహ్ర మాట్లాడుతూ.. ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు ఎంతో మంది మహనీయులు కృషి చేశారన్నారు. ముందుగా బీజేఆర్ చౌరస్తాలోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి స్పీకర్ ప్రసాద్ కుమార్, కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహ మెహ్రా, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ప్రజా ప్రతినిధులు, అధికారులు నివాళులర్పించారు. ఈ జయంత్యుత్సవాల్లో అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య, వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్, ఎస్సీడీడబ్ల్యూఓ జైపాల్ రెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శి రామచంద్రయ్య, పుష్పా రాణి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్, బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ కడియాల వేణుగోపాల్, మాజీ చైర్మన్ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రమేశ్ కుమార్, దళిత సంఘాల సీనియర్ నాయకులు భీమయ్య, రాజలింగం, ఆనంద్, పవన్, మైపాల్, కృష్ణ, సురేశ్, శ్రీ కాంత్, ఆయా శాఖల జిల్లా అధికారులు, ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


