తాండూరు రూరల్: ‘సార్ మీ కాళ్లు మొక్కుతా. మా పట్టా భూమిని ఇతరుల పేరిట మార్చకండి’ అని ఓ మహిళా రైతు తహసీల్దార్ కాళ్లు పట్టుకొని వేడుకుంది. ఈ సంఘటన శనివారం పెద్దేముల్ తహసీల్ కార్యాలయంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. బంట్వారం మండలం బోపునారం గ్రామానికి చెందిన నట్టల విమలమ్మకు.. పెద్దేముల్ మండలం తట్టెపల్లి గ్రామ శివారులో సర్వే నంబర్ 30బై అ2 బై ఆ సర్వే నంబర్‌లో 4 ఎకరాల 9 గుంటల పట్టా భూమి ఉంది. సోలార్ ప్లాంట్‌కు ఆనుకొని ఉండటంతో ఆ స్థలం విలువ ప్రస్తుతం రూ.కోట్లలో పలుకుతోంది. ఆ భూమి విక్రయించాలని తనపై ఓ నాయకుడు ఒత్తిడి తెస్తున్నాడని మహిళా రైతు విమలమ్మ ఆరోపించారు. సదరు వ్యక్తి తప్పుడు పత్రాలు సృష్టించి, రెవెన్యూ అధికారులతో కుమ్మకై ఆ భూమిని ఇతరుల పేరిట మార్పించేందుకు కుట్ర చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఇదే విషయమై ఆమె తన కుటుంబ సభ్యులతో శనివారం తహసీల్దార్ వెంకట్‌ప్రసాద్‌ను సంప్రదించారు. తమ పేరిట ఉన్న భూమిని, వేరే వారి పేరిట ఎలా మార్పిడి చేస్తారని ప్రశ్నించారు. గతంలో ఏసీబీకి చిక్కిన పెద్దేముల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రిచర్డ్ సైమన్.. ఓ నాయకుడి వద్ద డబ్బులు తీసుకొని తమ భూమిని మార్చేందుకు ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. తమకు అన్యాయం చేస్తే.. ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పెద్దేముల్ ఆర్‌ఐ పోస్ట్ ఖాళీగా ఉందని, మరో ఆర్‌ఐ వచ్చిన తర్వాత విచారణ జరిపించి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
మా పట్టా భూమిని
ఇతరుల పేరిట మార్చకండి
తహసీల్ కార్యాలయంలో
మహిళా రైతు ఆవేదన
విచారణ చేయిస్తానన్న తహసీల్దార్


