● కల్లు వాహనం అడ్డగించిన సర్పంచ్, సొసైటీ సభ్యులు
● చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్
తాండూరు రూరల్: పంచాయతీ అనుమతి లేకుండా గ్రామంలో కల్లు ఎలా విక్రయిస్తారని చెన్‌గేస్‌పూర్ సర్పంచ్ ప్రవీణ్‌గౌడ్ ప్రశ్నించారు. గడువు ముగిసినప్పటికీ అమ్మకాలు చేపట్టడం నిబంధనలు ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. శుక్రవారం గ్రామంలోని కల్లు డిపోనకు సరఫరా చేసేందుకు వచ్చిన వాహనాన్ని సర్పంచ్, సొసైటీ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం సర్పంచ్ తదితరులు మాట్లాడారు. గ్రామంలోని కల్లు సొసైటీలో 36 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. సంఘం అనుమతితో రెండేళ్లుగా గ్రామంలో కల్లు విక్రయించేందుకు డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ రవిగౌడ్ హక్కులు పొందారు. కానీ ప్రస్తుతం కాలపరిమితి తీరినప్పటికీ.. ఆయన దందా ఆపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లు పంచాయితీ ఎమ్మెల్యే మనోహార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, ఆయన మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని చెప్పినా.. రవిగౌడ్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అక్రమదందా గురించి ఎకై ్సజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.సమస్యను ఆ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.


