నిధుల బాధ్యత నాది | - | Sakshi
Sakshi News home page

నిధుల బాధ్యత నాది

Apr 1 2026 8:24 AM | Updated on Apr 1 2026 8:24 AM

వికారాబాద్‌ను అన్ని విధాలా

అభివృద్ధి చేస్తాం

మున్సిపల్‌ బడ్జెట్‌ సమావేశంలో

స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌

అనంతగిరి: వికారాబాద్‌ మున్సిపాలిటీకి అధిక నిధులు తెచ్చి అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్‌ సమావేశ మందిరంలో బడ్జెట్‌ సమావేశం జరిగింది. ఇటీవల కొత్తగా ఎన్నికై న పాలక కార్యవర్గ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి కేంద్ర మంత్రి, స్వర్గీయ జైపాల్‌రెడ్డితో మాట్లాడి వికారాబాద్‌ పట్టణానికి రూ.2,300 కోట్లతో శాటిలైట్‌ ప్రాజెక్టు మంజూరు చేయించినట్లు తెలిపారు. దేశంలో మొత్తం ఏడు శాటిలైట్‌ ప్రాజెక్టులు మంజూరైతే అందులో మనది ఒకటన్నారు. ప్రభుత్వాలు మారడంతో మెజారిటీ నిధులు రాలేదన్నారు. మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలో మూడు చోట్ల రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలను నిర్మించాల్సి ఉందని, నిధుల మంజూరు కోసం రైల్వే శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు. శివసాగర్‌ చెరువును పూర్తిగా ఆధునీకరిస్తామని చెప్పారు. మున్సిపల్‌ అభివృద్ధికి నిధులు తెచ్చే బాధ్యత తనదని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాణహిత – చేవెళ్ల, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా జిల్లాకు సాగునీరు తేవాలని ప్రయత్నం చేస్తే గత ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. పాలమూరు పథకం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతగిరిని రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెగా సంస్థతో ఒప్పందం కుదిరిందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మూడు వేల మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

సమస్యల పరిష్కారానికి కృషి

అనంతరం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గడ్డం అనన్య మాట్లాడారు. ప్రతి వార్డులో పర్యటించి సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామన్నారు. అనంతరం బీజేపీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 2026 – 27బడ్జెట్‌ అంచనాలకు ఆమోదం తెలిపారు, సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌, వైస్‌ చైర్మన్‌ అర్ధ సుధాకర్‌ రెడ్డి, కమిషనర్‌ విక్రం సింహారెడ్డి, బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ కడియాల వేణుగోపాల్‌, కౌన్సిలర్లు, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.

హైలెవల్‌ వంతెనతో ప్రయోజనం

ధారూరు: మండలంలోని రుద్రారం – నాగసమందర్‌ గ్రామాల మధ్య కోట్‌పల్లి ప్రాజెక్టు అలుగుపై హైలెవల్‌ వంతెన నిర్మాణంతో ఎంతో మేలు జరుగుతుందని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. ప్రతి ఏటా వానాకాలంలో అలుగు ఉధృతంగా ప్రవహించి రాకపోకలు స్తంభిస్తుంటాయని తెలిపారు. హైలెవల్‌ వంతెన నిర్మాణం పూర్తయితే ధారూరు నుంచి సంగారెడ్డి, జహీరాబాద్‌, కోట్‌పల్లి, బంట్వారం, మర్పల్లి, పెద్దేముల్‌, కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు ముంబై హైవేకి చేరుకోవడం దగ్గరవుతుందని పేర్కొన్నారు. మంగళవారం ఇందుకు సంబంధించిన పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వంతెన నిర్మాణానికి రూ.27.50 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. మాజీ వైస్‌ ఎంపీపీ వరద మల్లికార్జున్‌ ఈ సమస్యను తరచూ తన వద్దకు తెచ్చేవారని తెలిపారు. సకాలంలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.86.50 కోట్లు మంజూరు చేయించామని, పనులు శరవేగంతో సాగుతున్నాయని వివరించారు. మరో రూ.28 కోట్లు మంజూరు చేయిస్తానని తెలిపారు. వికారాబాద్‌ నియోజకవర్గంలో రూ.600 కోట్లతో కొత్తగా రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ దీపక్‌ తివారి, అదనపు కలెక్టర్‌ రాజేశ్వరీ, ఆర్‌అండ్‌బీ సీఈ వసంత్‌ నాయక్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మాన్‌సింగ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి, నాయకులు పి.రాములు, బాబాకాన్‌, రుద్రారం, నాగసమందర్‌ సర్పంచులు పాల్గొన్నారు.

వార్డు సభ్యులకు సర్టిఫికెట్లు అందజేత

ఐదు రోజుల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ సర్టిఫికెట్లు అందజేశారు. మండలంలోని 34 గ్రామ పంచాయతీలకు చెందిన 286 మంది వార్డు సభ్యులు ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు పాలనపై శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రాజేశ్వరి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మాన్‌సింగ్‌, ఏఎంసీ చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాములు, సర్పంచులు పాల్గొన్నారు.

హామీలు అమలు చేస్తున్నాం

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం వికారాబాద్‌ ఆర్‌టీసీ బస్టాండ్‌ ఆవరణలో రూ.10 వేల కోట్ల ప్రయాణ చార్జీల ఆదా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రూ.2 కోట్ల 4 లక్షల వ్యయంతో కూడిన ఉచిత ప్రయాణం చేశారన్నారు. అదేవిధంగా సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌, ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ వ్యయ పరిమితి పెంపు ఇస్తున్నట్లు తెలిపారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాజేశ్వరి, ఆర్‌టీఏ మెంబర్‌ జాఫర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సుధాకర్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ రాకేష్‌, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జానకీ, ఆర్టీసీ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement