తాండూరు రూరల్: పెద్దేముల్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ చిన్న నర్సిములు అధ్యక్షతన సోమవారం గ్రామ సభ నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి లాలప్ప ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంచాయతీ దుకాణ సముదాయం, తైబజార్, వాటర్‌ఫిల్టర్‌ల వేలం నిర్వహిస్తారని తెలిపారు. కావున వేలంలో పాల్గొనేవారు హాజరు కావాలని కోరారు.
బెదిరింపులపై
పోలీసులకు ఫిర్యాదు
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రైవేటు భూమిలోకి అక్రమంగా చొరబడి భయబ్రాంతులకు గురి చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆదిబట్ల ఎస్‌ఐ వెంకటేశ్ కథనం ప్రకారం.. నాదర్‌గుల్ సర్వే నంబర్ 613లో కోహినూర్ వెంచర్‌లోకి అదే ప్రాంతానికి చెందిన మహేశ్, రాజు, భాస్కర్, ప్రభాకర్, తిరుపతి భాస్కర్, శివప్రసాద్‌తో పాటు మరి కొందరు ఆదివారం మధ్యాహ్నం చొరబడి సెక్యూరిటీ వారిని బెదిరింపులకు గురి చేశారు. మహ్మద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వైభవంగా ఉత్సవాలు
ప్రారంభం
కడ్తాల్: మండల కేంద్రంలోని శ్రీ సీతారామాలయంలో విజయ గణపతి, జ్ఞాన సరస్వతి, సీతారామచంద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తొలిరోజు ఆదివారం శ్రీశైలం చంద్రశేఖర శివాచార్య మహాస్వామి శిష్య బృందంతో పాటు, అంగడి మఠం భువనేశ్వర్‌స్వామి, శివశ్రీ జ్ఞానేశ్వర శాస్త్రి, శ్రీమాన్ శ్రీరంగం అరేష చార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకం, ఆలయ ప్రవేశం, మహాగణపతి విశ్వక్సేన ఆరాధన, గౌరిపూజ, పుణ్యాహవాచనం, శివుడి రుద్రాభిషేకం, అఖండ దీపారాధన మహా మంగళహారతి, మంత్రపుష్ప, తీర్థ ప్రసాద వితరణ తదితర పూజలు జరిపించారు. కార్యక్రమంలో ఆలయ నిర్మాణదాతలు బస్వారాజ్ రాజమణి దంపతులు, అర్చకులు రామశర్మ, నాయకులు సంతోష్, మల్లేశ్, భక్తులు పాల్గొన్నారు.


