● బెట్టింగ్‌కు దూరంగా ఉండాలి
● సీఐ రఘుకుమార్
అనంతగిరి: ఆటలను ఆస్వాదించాలే కానీ.. బెట్టింగులకు పాల్పడి జీవితాలను ఆగం చేసుకోవద్దని వికారాబాద్ టౌన్ సీఐ రఘుకుమార్ అన్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభమైన నేపథ్యంలో సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో అక్రమ మార్గం ఎంచుకోవద్దని సూచించారు. ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెట్టింగ్‌కు పాల్పడి, డబ్బులు కోల్పోయాక కుటుంబంలో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడికి గురై.. నేరాల బాట పట్టిన వారు లేకపోలేదన్నారు. ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో వెలుగు చూశాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను గమనిస్తుండాలని చెప్పారు. ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడినట్లు తెలిస్తే.. 8712670030కు సమాచారం ఇవ్వాలని కోరారు.
వ్యక్తి ఆత్మహత్య
బంట్వారం: ఆరోగ్య సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం బంట్వారం మండల పరిధి బొప్పునారంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ విమల తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొల్ల అంజయ్య(61), వ్యవసాయం చేసేవాడు. అనారోగ్యంతో చాలాకాలంగా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మానసికంగా కృంగిపోయిన అంజయ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి భార్య సత్తెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
169 కేసులు పరిష్కారం
ఇబ్రహీంపట్నం: స్థానిక న్యాయస్థానంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 169 కేసులు పరిష్కారమయ్యాయి. ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో 77, మంచాల పరిధిలో 23, యాచారం పరిధిలో 27, ఫార్మాసిటీ పరిధిలో 8, మాడ్గుల పరిధిలో 34 కేసులు పరిష్కారం అయినట్లు 15వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి. ప్రవీణ్‌కుమార్ తెలిపారు.


