నిర్వహణ కరువైన రైతు వేదికలు
● నీటి వసతి లేక నిరుపయోగంగా టాయిలెట్స్
● ఇబ్బంది పడుతున్న రైతులు, ఏఈఓలు
● పట్టించుకోని ప్రభుత్వం
నిధులు లేక రైతువేదికల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. శుభ్రం చేసేందుకు సహాయకులను సైతం ఏర్పాటు చేయకపోవడంతో ఏఈఓలు ఇబ్బంది పడుతున్నారు.
మర్పల్లి: రైతు వేదికలు నిర్వహణ లోపంతో అస్తవ్యస్తంగా మారాయని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఏఈఓలకు ఇబ్బందులు తప్పడం లేదు. 2020లో గత ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం గత ప్రభుత్వం మర్పల్లి, కల్‌ఖోడ, సిరిపురం, పట్లూర్, బిలకల్ గ్రామాలలో రైతు వేదికలను నిర్మించింది. ఇక్కడ సమావేశాల కోసం ఫర్నిచర్ సైతం సమకూర్చారు. వ్యవసాయశాఖ ద్వారా చేపడుతున్న టెలీ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యే రైతులకు ఇబ్బంది తప్పడం లేదని వాపోతున్నారు. తాగునీరు సైతం లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని.. నీటి వసతి లేక టాయిలెట్స్ సైతం నిరుపయోగంగా మారాయంటున్నారు. రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించే సమావేశాలకు ప్రతీ నెల రూ.9 వేల వరకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. 2022లో ఐదు నెలలకుగాను రూ.45 వేలు విడుదల చేశారు. దీంతో ఎప్పటికై నా నిధులు వస్తాయనే నమ్మకంతో ఏఈఓలు సొంత ఖర్చుతో రైతు వేదికల నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. 2022–2026 మార్చి వరకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రైతు వేదికల్లో అత్యవసరమైన సేవలకు కనీస వసతులు కల్పించాలని విద్యుత్ బిల్లులు, స్టేషనరీ, తదితర ఖర్చులకు మరమ్మత్తులు చేపట్టేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


