తాండూరు టౌన్: ఎల్‌పీజీ గ్యాస్ కొరత తీర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిట్ ఆరోపించారు. గ్యాస్ ధరల పెంపు, కొరతపై సోమవారం స్థానిక అంబేడ్కర్ చౌక్‌లో ఖాళీ సిలిండర్లతో ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరశిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్ ధర పెంపు, కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడినప్పటికీ కేంద్రం మాత్రం కొరత లేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. పెరిగిన ధరలను తగ్గించడంతో పాటు, ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు అబ్దుల్లా, రవీందర్, మునీర్ అహ్మద్, పుష్ప, లక్ష్మి, దస్తప్ప, రాజేందర్, రాజు, బుగ్గప్ప, నర్సింలు, మంగమ్మ, వెంకటమ్మ పాల్గొన్నారు.
గ్యాస్ కొరత.. హోటళ్ల మూత
దుద్యాల్: గ్యాస్ కొరత రోజురోజుకూ తీవ్రమవుతోంది. హోటల్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.. కమర్షియల్ సిలిండర్ల సరఫరా ఆగిపోవడంతో వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే పలు హోటళ్లు మూత పడ్డాయి. దీంతో పలువురికి పని లేకుండా పోయింది. ఈ సమస్య ఎప్పటికి తీరుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. దుద్యాల్ గేట్ వద్ద రెండు, మండల కేంద్రంలో మరి కొన్ని హోటళ్లు మూత పడ్డాయి. అల్పాహారం దొరక్క ప్రయాణికులు, ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల కొరత లేకుండా చూడాలని ప్రజలు, వ్యాపారులు కోరుతున్నారు.
ఆందోళన చేపట్టిన సీపీఐ నాయకులు


