● మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ
● ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా 2కే రన్
తాండూరు టౌన్: యువతను పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని ప్రజలంతా కలిసి కట్టుగా తరిమి కొట్టాలని మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ పిలుపునిచ్చారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా స్థానిక శివాజీ చౌక్ నుంచి ఇందిరాచౌక్ వరకు 2 కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా విస్తృత ప్రచారం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందన్నారు. డ్రగ్స్ రహిత తాండూరుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. యువత క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలపై, ఉజ్వల భవిష్యత్‌పై ఆసక్తి పెంచుకోవాలన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఓ మాజీ ప్రజాప్రతినిధి డ్రగ్స్ కేసులో పట్టుబడటం తాండూరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తాండూరు పేరు డ్రగ్స్ అంశంలో వినిపిస్తోందని, అలాంటి చెడ్డ పేరు రాకుండా ఇకపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై యువతకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆదేశించారన్నారు. తాండూరు ప్రజలంతా కలిసి డ్రగ్స్ మహమ్మారిపై తిరుగబాటు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కౌన్సిలర్లు రామకృష్ణ, నాగారం మల్లేశం, స్వరూప, బాలకృష్ణారెడ్డి, వెంకట్, నాయకులు సర్దార్ ఖాన్, నయీం, సోమశేఖర్, రవి, మాధవి, పర్యాద రామకృష్ణ, వంశీ, సత్యమూర్తి, ప్రవీణ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


