● సంతాపూర్ ఉప సర్పంచ్ దుర్మరణం
● మరొకరి పరిస్థితి విషమం
● ఏపీలో దుర్ఘటన
పెనుకొండ రూరల్: టమాట పైరు కోసం వచ్చిన కేశంపేట ప్రాంతానికి చెందిన ఓ రైతు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కేశంపేట మండలం సంతాపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ అంజయ్య(45), తన పొలంలో టమాట సాగు చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో కర్ణాటక సరిహద్దున ఉన్న నర్సరీల్లో టమాట పైరు కొనుగోలు చేసేందుకు సమీప బంధువు శ్రీకాంత్‌తో కలసి కారులో ఆదివారం రాత్రి బయలుదేరాడు. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో ఏపీ లోని పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలో ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో.. డ్రైవర్ శ్రీనివాసులు నియంత్రణ కోల్పోవడంతోలారీ కిందకు కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసుతో పాటు పక్కనే ముందు సీటులో కూర్చున్న అంజయ్య తీవ్రంగా గాయపడ్డారు. కారు నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న కియా పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులనుపెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అంజయ్య మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసుకు ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి రెఫర్ చేశారు. వెనుక సీటులో ఉన్న మరో వ్యక్తి శ్రీకాంత్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఘటనపై కియా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


